- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీరుగారుతోన్న ‘మిడ్ డే మీల్స్’ పథకం.. ‘మెనూ’ బేఖాతరు
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మారుమూల ప్రాంతాలతోపాటు పట్టణాల్లోని సర్కారు బడుల్లో ఇలాంటి పరిస్థితే ఉన్నదనే చర్చ జరుగుతున్నది. దీంతో విద్యార్థులకు పోషకాహారం అందకుండాపోతున్నది. ఇటీవల తోగుట మండల ప్రాథమిక పాఠశాలను సిద్దిపేట కలెక్టర్ తనిఖీ చేసినప్పుడు మెనూ ప్రకారం పిల్లలకు ఆహారం వడ్డించడంలేదనే విషయం బయటపడింది. దీంతో వివరణ ఇవ్వాలని హెడ్మాస్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ ఒక్కచోటే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాగే జరుగుతున్నట్లు తెలుస్తున్నది. వంట సిబ్బందికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, హెడ్మాస్టర్లు, ఎంఈఓలు, డీఈఓలు చూసీచూడనట్లు వ్యవహరించడంతో విద్యార్థులకు పోషకాహారం అందని ద్రాక్షగానే మిగులుతున్నదనే చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో 30 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అయితే సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించడం కష్టంగా మారుతున్నదని గతంలో విద్యాకమిషన్ సైతం పేర్కొంది. ఇదే విషయమై ప్రభుత్వానికి నివేదిక సైతం అందించింది. మరోవైపు పాఠశాల భాద్యతను చూడాల్సిన హెడ్మాస్టర్లకు తనిఖీల సమయంలో ఇబ్బందులు తప్పట్లేదు. డీఈఓలు, కలెక్టర్లు పాఠశాలను తనిఖీ చేస్తే ముందుగా చూసేది వంటకాలనే. ఒకవేళ ఫుడ్ మెనూ బాగుంటే సరే.. లేదంటే హెడ్మాస్టర్లు, ఆయా అధికారులు వివరణ ఇవ్వాల్సి వస్తున్నది.
నిబంధనల్లోనే మెనూ..
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పప్పు, సాంబార్, ఆకుకూరలు, వారానికి మూడు సార్లు కోడిగుడ్డు, ఇంటర్వెల్ టైంలో రాగిజావ ఇవ్వాలి. కానీ చాలా చోట్ల రాగిజావ ఇవ్వడం లేదు. నిబంధనల ప్రకారం వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వాలి. ఒక్కో గుడ్డుకోసం ప్రభుత్వం ఇస్తున్నది రూ. 5 నుంచి 6 మాత్రమే. మార్కెట్లో గుడ్డు ధర రూ. 7 వరకు ఉంది. దీంతో స్కూళ్లలో చాలా చోట్ల వారానికి ఒకటీ, రెండు గుడ్లనే అందిస్తున్నట్లు తెలుస్తున్నది. మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో పాటు పరిశుభ్రత ఆశించడం అత్యాశే అవుతుందని అర్థమవుతున్నది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థత, పలుచోట్ల తీవ్ర అనారోగ్యానికి గురైన సంఘటనలు వెలుగుచూశాయి.
ఏమీ అనలేని స్థితిలో హెడ్మాస్టర్లు..
మధ్యాహ్న భోజనం కోసం వంట చేసే సిబ్బంది పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వారికి కనీస వేతనం ఇవ్వకపోవడంతో ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లు కూడా వారిని ఏమీ అనలేకపోతున్నారు. తాము అప్పుచేసి వండిపెడుతుంటే బిల్లులు ఆలస్యంగా వస్తున్నాయని, వడ్డీభారం మోయాల్సి వస్తున్నదని అనేక చోట్ల స్వయం సహాయక సంఘాల మహిళలు వాపోతున్నారు. ఇక చాలీ చాలని నిధులతో నాణ్యమైన కూరగాయలు తీసుకురాలేక పోవడం, నిల్వ చేసేందుకు తగిన మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడమే మెనూ పాటించకపోవడానికి ప్రధాన కారణమని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు చెబుతున్నారు. బిల్లులు సకాలంలో అందకపోవడంతో నాణ్యమైన ఆహారాన్ని అందించడం కష్టంగా మారిందని, అందుకే మెనూను పాటించలేకపోతున్నామని చెబుతున్నారు.






