దారి లేని భూములను కొనుగోలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు.. అధికార వర్గాల్లో ఉన్న అనుమానమిదే!

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్ 194, 195లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు భూములను కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

దారి లేని భూములను కొనుగోలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు.. అధికార వర్గాల్లో ఉన్న అనుమానమిదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్ 194, 195లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు భూములను కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 2023, 2024 సంవత్సరాల్లో ఈ కొనుగోళ్లు జరగ్గా.. అప్పుడు అవి భూదాన్ భూములంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను రంగారెడ్డి కలెక్టర్, మహేశ్వరం తహశీల్దార్లు కొట్టిపారేశారు. సర్వే నం.194, 195లో భూధాన్ భూమి లేదని, నిషేధిత జాబితాలో నుంచి తొలగించిన తర్వాతే ఈ స్థలాలను కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. 1954–55 ఖాస్రా పహానీ ప్రకారం ఈ విషయాలను చెప్పారు. అయితే భూములను కొనుగోలు చేసిన వారు హక్కులను, రికార్డులను పక్కాగా చెక్ చేశారా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు వీటి సేల్ డీడ్స్ లో క్లాసిఫికేషన్ పరిశీలిస్తే నలువైపులా పట్టాదారులే కనిపిస్తున్నారు. కనీసం ఒకవైపు కూడా బాట లేదు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గా పని చేసిన నవీన్ మిట్టల్ వంటి నిపుణులు కొనుగోలు చేసిన స్థలానికి కూడా వెళ్లడానికి మార్గం లేకపోవడం గమనార్హం. ప్రభుత్వంలో కీలకభూమిక పోషించే ఐఏఎస్, ఐపీఎస్‌లు కనీసం దారి లేని భూములను కొనుగోలు చేయడం వెనక ఆంతర్యమేమిటనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతున్నది.

అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ లు, వారి కుటుంబ సభ్యులే

సర్వే నం.194, 195లోని భూములను కొనుగోలు చేసిన వాళ్లలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

- సర్వే నం.194/ఖ2లో 0.20 ఎకరాలను ఐశ్వర్యారాజ్, తండ్రి వికాస్ రాజ్ (నార్త్ వెంకటేశ్వర్ రావు/ఇతరులు, సౌత్ మధుసూదన్ రెడ్డి/ఇతరులు, ఈస్ట్ సురేశ్, వెస్ట్ సురేశ్) 2023 నవంబరు 6న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/ఖలో 0.20 ఎకరాలను వసుంధర సిన్హా, భర్త అంజనీకుమార్ 2023 నవంబరు 5న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/ఖలో 0.20 ఎకరాలను అజిత్ కుమార్ మెహంతీ, తండ్రి క్షేత్రబసి మెహంతీ 2023 నవంబరు 2న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/ఖలో 0.16 ఎకరాలను జి. ఓం అనిరుధ్, తండ్రి సుధీర్ బాబు గొట్టె 2024 జనవరి 25న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/నలో 0.08 ఎకరాలు నందిని మన్న్, భర్త విక్రంసింగ్ మన్న్ 2024 జులై 10న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/ఖలో 0.20 ఎకరాలు రీటా సుల్తానియా, భర్త సందీప్ కుమార్ సుల్తానియా 2023 డిసెంబరు 5న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/ఖలో 0.16 ఎకరాలు వెన్నవెల్లి రాధిక, భర్త కమలాసర్ రెడ్డి 2023 నవంబరు 9న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/జలో 0.16 ఎకరాలు మహేశ్ మురళీధర్ భగవత్, తండ్రి మురళీధర్ రంగనాధ్ భగతవ్ 2023 నవంబరు 17న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/నలో 0.20 ఎకరాలు ముదిరెడ్డి నితీశ్ రెడ్డి, తండ్రి ముదిరెడ్డి మహేందర్ రెడ్డి 2023 నవంబరు 6న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/జలో 0.16 ఎకరాలు తరుణ్ జోషి, తండ్రి రతన్ భూషన్ జోషి 2024 మార్చి 7న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/జలో 0.20 ఎకరాలు రేణుగోయల్, భర్త జితేందర్ గోయల్ 2023 నవంబరు 6న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/జలో 0.16 ఎకరాలు పేర్ల వరుణ్, తండ్రి పేర్ల విశ్వప్రసాద్ 2024 మార్చి 7న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/జలో 0.20 ఎకరాలు దివ్య శ్రీ మోర్తాటి, తండ్రి ఆంజనేయులు 2024 మార్చి 7న కొనుగోలు చేశారు.

- సర్వే నం.194/ఖలో 0.20 ఎకరాలు నవీన్ మిట్టల్, తండ్రి ఎంఎల్ మిట్టల్ 2023 నవంబరు 6న కొనుగోలు చేశారు.

అయితే ఈ భూములకు సంబంధించి డాక్యుమెంట్స్ లో దారి లేదు. నలువైపులా పట్టాదారుల భూములే ఉన్నాయి. మరి వీళ్లు వారు కొన్న ల్యాండ్ దగ్గరికి ఎలా వెళ్తారో అంతుచిక్కడం లేదు. కనీసం దారి లేని భూములను ఎలా కొనుగోలు చేశారో అర్థం కావడం లేదనే చర్చ జరుగుతున్నది.

సర్వే నం.194, 195 లావాదేవీలు ఇలా..

నాగారంలో సర్వే నం.194, 195లోని భూమి వసూల్ బాకీ రిజిస్టర్ ప్రకారం పట్టాగా నమోదైంది. 194లో 383.20 ఎకరాలు హాజీ ఖాన్ సాహెబ్ నవాబ్ పేరిట ఉంది. అలాగే 195లో 335.20 ఎకరాలు కూడా పట్టాగానే నమోదైంది. ఆ తర్వాత అనేక సబ్ డివిజన్లుగా మారింది. లేఖ నం.E5/623/2013, తేదీ.11.02.2019 ప్రకారం సర్వే నం.194, 195లోని ల్యాండ్ ను ఐజీఆర్ఎస్ వెబ్ సైట్ లో ప్రొహిబిటరీ ప్రాపర్టీ లిస్టు నుంచి తొలగించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి రాశారు. ఆ తర్వాత ధరణి పోర్టల్ లో పలు ట్రాన్సాక్షన్స్ చోటు చేసుకున్నాయి. దాంతో రుద్ర శ్రీనివాసులు, కొండూరి మనోహర్, మరో ముగ్గురు కలిసి సర్వే నం.194లోని 9.20 ఎకరాలను, మహ్మద్ అబ్దుల్ జావీద్, కొండూరి మనోహర్, ఇతరులు కలిసి సర్వే నం.194లోని 9 ఎకరాలను బసబోయిన సురేశ్ కు అమ్మేశారు. ఇదంతా 2021లోనే చోటు చేసుకున్నది. ఆ తర్వాత 62 లావాదేవీలు జరిగాయి. ఇందులోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే టెర్మినస్ వెంచర్ ప్రైవేటు లిమిటెడ్ వంటి కంపెనీ కూడా ఉంది. అయితే వివాదాస్పదంగా మారిన భూములను కొనుగోలు చేయడంలో ప్రభుత్వంలోనే కీలక పాత్ర వహిస్తున్న, భూ పరిపాలనలోనే సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన నవీన్ మిట్టల్ వంటి వారి పేర్లు ఉండడం ఆసక్తికరంగా మారింది.

అసలు భూదాన్ భూమి ఎంత?

మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నం.181/1లో 13.08 ఎకరాలు, 181/2లో 16.05 ఎకరాలు, 181/3లో 20.38 ఎకరాలు, 181/4లో 15.35 ఎకరాలు, 181/5లో 16.10 ఎకరాలు, 181/6లో 10.17 ఎకరాలు, 182లో 10.02 ఎకరాలు పట్టాగా రికార్డులో ఉంది. ఇదంతా నవాబ్ హాజీఖాన్ పేరిట ఉంది. అలాగే సర్వే నం.181/ లో 92.33 ఎకరాలు, 182లో 10.29 ఎకరాలు అంటే మొత్తం 10.322 ఎకరాలు ఆయన పేరిటే ఉంది. సర్వే నం.181(పాతది 47)లో 50 ఎకరాలు భూదాన్ ఖారిజ్ ఖాతా అంటూ భూదాన్ యజ్ఞ బోర్డు సి/32/06, తేదీ.10.04.2006న మహేశ్వరం తహశీల్దార్ కి లేఖ రాశారు. ఆయన మెమో నం.బి/1181/2006, తేదీ.17.4.2006న నాగారం పంచాయతీ సెక్రెటరీకి రాశారు. 2002–03 నుంచి భూదాన్ గా రికార్డు అయినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి 181/1, 181/2, 181/3 లోని 50 ఎకరాలను భూదాన్ ఖారిజ్ ఖాతాగా పహానీల్లో నమోదు చేశారు. అయితే మెమో పంచాయతీ సెక్రెటరీకి ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటి? రెవెన్యూ రికార్డుల నిర్వహణ వీఆర్వోల చేతిలో ఉంటుంది కదా! అలాగే 2006 వరకు రెవెన్యూ రికార్డుల్లో భూదాన్ భూమిగా నమోదు చేయించడంలో భూదాన్ యజ్ఞ బోర్డు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే 2003 నుంచి 2006 మధ్య కాలంలోనే అనేక లావాదేవీలు చోటు చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఆ తర్వాత పరిణామాలతోనే భూదాన్ యజ్ఞ బోర్డు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాలతోనే 181/3/1లో 0.11 ఎకరాలు, 181/4లో 15.35 ఎకరాలు, 181/5లో 16.10 ఎకరాలు, 181/6లో 10.17 ఎకరాలు, 182లో 7.07 ఎకరాలు.. మొత్తం 50 ఎకరాలను భూదాన్ ల్యాండ్ గా రికార్డు చేశారు.

‘నాగారం’ కేసులో క్లీన్ చిట్ ప్రయత్నాలు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో 50 ఎకరాల ఖరీదైన భూమికి ఎన్వోసీలు జారీ చేసిన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా ఈడీ విచారణ చేసింది. అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్, ఆర్డీవో వెంకటాచారి, తహశీల్దార్, ఇతర సిబ్బందిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అక్రమాలు చోటు చేసుకున్నాయని, కేసు నమోదు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. అయితే ఆ తర్వాత అంతా సైలెట్ అయింది. అక్రమాలు చేసిన అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతున్నది. సర్వే నం.181లో తాము ఎలాంటి తప్పు చేయలేదని కలెక్టర్ తో సహా అందరూ కౌంటర్ దాఖలు చేసినట్లు సమాచారం. పట్టా భూమికే ఎన్వోసీలు ఇచ్చామని, మిగిలిన భూమే భూదాన్ గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇంతకీ నాగారం 181 (ఓల్డ్ సర్వే నం.47)లో భూదాన్ భూమి 50 ఎకరాలు ఉందా? లేదా? అనేది తెలియకుండాపోయింది. ఫోర్త్ సిటీకి అత్యంత సమీపంలోని ఈ వివాదాస్పద స్థలంపై విచారణ ముగిసినట్లేనన్న అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తున్నది.

Next Story