ఈ నెల 16 నుంచి కులవృత్తుల మేళా

by velandi.Saikiran |

బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడొద్దని మంత్రి పొన్నం ఆదేశించారు.

ఈ నెల 16 నుంచి కులవృత్తుల మేళా
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమై 20 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆ ప్రాంగణాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. బీసీ స్టడీ సర్కిల్స్‌ను మరింత బలోపేతం చేసేందుకు, సివిల్స్ కోచింగ్‌తో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణను సమర్థవంతంగా అందించేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేయాలని సూచించారు.

కులవృత్తుల మేళా..

జూలై 16 నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించే కులవృత్తుల మేళాలో అన్ని కులాలకు చెందిన సంప్రదాయ వృత్తిదారులకు సమాన అవకాశాలు కల్పించాలని, ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మహిళల కోసం కుట్టు మిషన్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు సమగ్ర విధి విధానాలను రూపొందించాలన్నారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్‌పై అధ్యయనం చేసి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. బీసీ సంక్షేమ కమిషనర్, గురుకులాల కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఐఐటీ, ఐఐఎంలలో సీట్లు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీపై నివేదిక కోరారు. కాటమయ్య రక్షణ కవచాల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వెంటనే కిట్లు అందజేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమాయదేవి, గురుకులాల కార్యదర్శి సైదులు, మల్లయ్య భట్టు, మామిడి హరికృష్ణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story