- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నివేదిక దాదాపు సిద్ధం.. కేసీఆర్, హరీశ్ రావులను ఎందుకు పిలవలేదంటే..?
కాళేశ్వరం కమిషన్ నివేదికను వచ్చే వారం ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ మేరకు నివేదికకు తుది రూపు ఇస్తున్నట్లుగా తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ నివేదికను వచ్చే వారం ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ మేరకు నివేదికకు తుది రూపు ఇస్తున్నట్లుగా తెలిసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలపై గత సంవత్సరం ఫిబ్రవరిలో కమిషన్‌ను నియమించింది. మొదట 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. అయితే కమిషన్ గడువు పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది.
కేసీఆర్ ఆదేశాల మేరకే పనులు
కమిషన్ విచారణలో భాగంగా ఇప్పటి వరకు బ్యారేజీ పనుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన అధికారులందరిని కమిషన్ విచారించింది. క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కాళేశ్వరంపై వివిధ సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, దానిపై సమాచారం ఉన్న వారందరి నుంచి వివరాలను, ఆధారాలను సేకరించింది. వాటన్నింటిని నోట్ చేసుకుంది. కొందరు కీలక అధికారులను రెండు సార్లు విచారించింది. దాదాపుగా 100కుపైగా అధికారులు, సంఘాల ప్రతినిధులను, సంస్థల ప్రతినిధులను అధికారులందరిని విచారించింది. ఆనాటి సీఎం కేసీఆర్ ఆదేశాలు, సూచనలకు అనుగుణంగానే తాము పనులు చేశామని, నిర్ణయాలను ఫాలో అయ్యామని, సొంతంగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారందరూ విచారణ సందర్భంగా తెలిపారు. బ్యారేజీల స్థలాలను మార్చడం, నీటి నిల్వ చేయడం, సికేంట్ టెక్నాలజీతో పనులు చేయడం, హడావుడిగా రాత్రి రాత్రికి పనులు చేయడం, తదితర వాటన్నంటిని కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే చేశామని చెప్పారు.
400లకు పైగా పేజీలతో నివేదిక?
కేసీఆర్ నాడు సీఎంగా ఉన్నారు, కాబట్టి ఆయన ఆదేశాలు, సూచనలను కాదనే పరిస్థితి ఉండదని, కాబట్టి తాము వాటిని అమలు చేశామని వెల్లడించారు. విచారణలో కాళేశ్వరం బ్యారేజీల స్థలం ఖరారుకు, మార్పు చేయడానికి, నీటి లభ్యత, డిజైన్‌ల మార్పులు, నీటి నిల్వ చేయడం, ఇలా అన్నింటిని కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే చేశామని వారు వివరించారు. దీంతో విచారణ కమిషన్ కేసీఆరే బాధ్యుడనే ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలిసింది. ఆయన నిర్ణయాల కారణంగానే కాళేశ్వరం బ్యారేజీల అనర్థాలకు దారితీసిందని నివేదికలో పేర్కొన్నట్లుగా తెలిసింది. కమిషన్ నివేదికను దాదాపుగా 400కు పైగా పేజీలతో రూపొందించినట్లుగా సమాచారం.
కేసీఆర్, హరీశ్ రావులను ఎందుకు పిలవలేదంటే..
అయితే అధికారులందరూ కేసీఆర్ పేరే చెప్పినా ఆయనను విచారణకు పిలవకుండానే నివేదిక ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కేసీఆర్, హరీశ్‌రావులను విచారణకు పిలిస్తే ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను ముందుగానే అంచనా వేసినట్లుగా తెలిసింది. గతంలో విద్యుత్ విచారణ కమిషన్ లాంటి వాటిల్లో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని కేసీఆర్‌ను విచారణకు పిలవడంలేదని సమాచారం. తాము విచారించిన అధికారులందరు డాక్యుమెంట్‌తో సహా కేసీఆర్ పేరు చెప్పినందున వారు చెప్పిన వివరాల ఆధారంగా కేసీఆర్ బాధ్యుడనే విధంగా నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే వారం నివేదిక
నివేదిక వచ్చే వారం ప్రభుత్వానికి అందనుంది. అనంతరం ప్రభుత్వం కేబినెట్ నివేదికపై చర్చించనుంది. తదనుగుణంగా కేబినెట్ సబ్ కమిటీనా, లేదా నిపుణులైన అధికారులతో కమిటీ వేయడమా అనే అంశం కొలిక్కి రానుంది. చివరగా ఆ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నివేదికను అసెంబ్లీ ముందు ఉంచనుంది. అక్కడ చర్చించే అవకాశం ఉంది.






