Supreme Court: కనీసం చలనం లేదా? వీధి కుక్కల అంశంలో రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం

by Prasad Jukanti |

అంతర్జాతీయంగా దేశం పరువు తీశారని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు మండిపడింది.

Supreme Court: కనీసం చలనం లేదా? వీధి కుక్కల అంశంలో రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వీధి కుక్కల నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు స్పందించలేదంటూ ఆయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను అమలు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యారని, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ సర్వోన్నత న్యాయస్థాన మండిపడింది. తమ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయని, వీధి కుక్కల (stray dogs) దాడులపై రోజూ మీడియాలో వార్తలు వస్తున్నా.. చలనం లేదా అని ప్రశ్నిచింది. తమ ఆదేశాల మేరకు అఫిడవిట్లు దాఖలు చేయడంలో విఫలం అయినందుకు పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల సీఎస్‍లంతా నవంబర్ 3న జరగబోయే తదుపరి విచారణలో స్వయంగా హాజరై ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. లేకుంటే ఫెనాల్టితో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే తమ అఫిడవిట్లు దాఖలు చేశాయని అయితే దీపావళి సెలవుల్లో కౌంటర్ దాఖలు చేసినందున అవి తమ రికార్డులో లేవని ధర్మాసనం పేర్కొంది. వీధికుక్కల సమస్యకు సంబంధించిన సుమోటో కేసులో గత ఆగస్టులో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల నియంత్రణ విషయంలో వాటిని పట్టుకుని శస్త్రచికిత్సచేసి తిరిగి వదిలే విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది. కానీ రాష్ట్రాలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ పరిణామాలపై సోమవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story