- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవినీతికి కేరాఫ్‌గా ఇరిగేషన్ శాఖ.. ఏసీబీ రెయిడ్స్‌లో అగ్ర స్థానం
రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో నీటి పారుదల శాఖ కాసులు కురిపిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో నీటి పారుదల శాఖ కాసులు కురిపిస్తోంది. ఆ శాఖకు చెందిన అధికారులే వరుసగా పట్టుబడుతున్నారు. ఇక ఏసీబీకి చిక్కిన నీటి పారుదల శాఖ అధికారుల అక్రమ సంపాదన చూస్తే ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే. ఏసీబీ నిర్వహిస్తున్న దాడుల్లో ఇప్పటివరకు చాలా మందే పట్టుబడ్డారు. అందులో రూ. వెయ్యి, లక్ష లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు కూడా ఉన్నారు. ఉపాధ్యాయులు, వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు, తహశీల్దార్లు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఇలా అన్ని విభాగాలకు చెందిన అధికారలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వారి జాబితాలో ఉన్నారు. అయితే, ఇప్పటివరకు పట్టుబడిన వారితో పోల్చి చూసుకుంటే ఇరిగేషన్ శాఖ అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఏసీబీ ప్రకారం ఎవరెన్ని ఆస్తులు కూడబెట్టారంటే..
ఏఈఈ నికేశ్ రూ.200 కోట్లకు పైగానే..
2024 మే 31న లంచం తీసుకుంటూ ఇరిగేషన్ శాఖ ఏఈఈ నికేశ్ పట్టుబడ్డాడు. విచారణలో భాగంగా ఆయన ఆస్తులపై డిసెంబర్‌లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. సుమారు 30చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించగా.. అధికారికంగా రూ.17.73 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ సుమారు రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
నికేశ్ కుమార్ ఆస్తులు వివరాలు..
నానక్‌రాంగూడ, శంషాబాద్, గచ్చిబౌలిలో విల్లాలు, మొయినాబాద్ మండలం సజ్జనపల్లి, తోలకట్ట, నక్కలపల్లిలో 3 ఫామ్ హౌస్లు, రూ.3.5 కోట్లు విలువ చేసే ఓ వాణిజ్య భవనం, నార్సింగిలో 4 అంతస్తుల హాస్టల్ భవనం, తాండూరులో 3 ఎకరాలు, బ్యాంక్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి.
కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఆస్తుల వివరాలు..
నీటిపారుదల శాఖ సీఏడీ డిపార్ట్‌మెంట్ ఇంజినీర్ ఇన్ చీఫ్, కాళేశ్వరం ఈఎన్సీగా చేసిన భూక్య హరిరామ్‌పై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం దానిపై దర్యాప్తు జరుగుతుంది. ఏకకాలంలో 13 చోట్ల దాడులు నిర్వహించగా.. భారీగా ఆస్తులు లభ్యమయ్యాయి. అందులో షేక్‌పేట్‌లో విల్లా, కొండాపూర్‌లో విల్లా, శ్రీనగర్‌లో ఫ్లాట్, మాదాపూర్‌లో ఫ్లాట్, నార్సింగిలో ఫ్లాట్, అమరావతిలో కమర్షియల్ ప్లాట్, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరువులో 20 గుంటలు, హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు, బొమ్మల రామారాంలో 6 ఎకరాల్లోని మామిడి తోటలో ఒక ఫామ్‌హౌస్, కొత్తగూడెం, కుత్బుల్లాపూర్‌లో ఓపెన్ ప్లాట్, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్, బీఎండబ్ల్యూ కారు సహా ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు దొరికాయి.
ఈఈ నూనె శ్రీధర్ వద్ద భారీగా ఆస్తులు..
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ ప్రస్తుతం ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు చెందిన 13 చోట్ల ఏసీబీ దాడులు చేయగా రూ.కోట్లు విలువ చేసే అక్రమ ఆస్తులను గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 6,7,8 ప్యాకెజీ పనులలో విధులు నిర్వహించారు. ప్రస్తుం ఏసీబీ కస్టడీలో ఉన్న శ్రీధర్ ఆస్తులపై విచారణ జరుగుతుంది. కాగా, శ్రీధర్‌కు అమీర్ పేటలో వాణిజ్య స్థలం, తెల్లపూర్‌లో విల్లా, షేక్ పేట్‌లో ఫ్లాట్, కరీంనగర్‌లో 3 ఫ్లాట్లు, హైదరాబాద్‌లో ఇండిపెండెంట్ హౌస్, వరంగల్‌లో ఇండిపెండెంట్ హౌస్, కరీంనగర్‌లో ఇండిపెండెంట్ హౌస్, 16 ఏకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో 19 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు, రెండు కార్లు, బ్యాంకులో భారీగా నగదు నిల్వ, బంగారు ఆభరణాలను గుర్తించారు.
ఏసీబీ దాడులు దేనికి సంకేతం
ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యండెడ్ పట్టుకుంటున్నా కొందరు అధికారుల తీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఏసీబీకి పట్టుబడ్డ అధికారుల్లో ఇకనైనా మార్పు మార్పు వస్తుందా? అనే సందేహలు ఉన్నాయి. ఏసీబీకీ పట్టుబడినా ఏం అవుతుందిలే అనే ధీమాలో వాళ్లంతా ఉన్నారా? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకొవాలని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అవినీతికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకువస్తే లంచం తీసుకునే వారిలో భయం మొదలవుతుందని నిపుణులు హెచ్చరించారు.






