స‌మీకృత‌ భూ భార‌తి పోర్టల్‌ తొలి అడుగు.. రాష్ట్రంలో భూ సమస్యలకు ఇక చెక్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-01 11:48:50  IST  )

తెలంగాణలో భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి’ పోర్టల్ సిద్ధమైంది. 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం కానున్న ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా భూధార్, రోవర్ సర్వే వంటి సేవలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి.

స‌మీకృత‌ భూ భార‌తి పోర్టల్‌ తొలి అడుగు.. రాష్ట్రంలో భూ సమస్యలకు ఇక చెక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ 'ఇంటిగ్రేటెడ్ భూ భారతి' పోర్టల్‌ను రూపొందించామన్నారు. ఈ పోర్టల్‌ను గురువారం (2వ తేదీ) నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి ఇది తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు.

కేరళ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి, బుధవారం నాడు పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్‌ను రైతు కోణంలో రూపొందించామని, సామాన్య రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

లైసెన్స్‌డ్ సర్వేయర్‌తోనే సర్వే..

గతంలో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా, ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్‌ను రూపొందించామని మంత్రి తెలిపారు. రైతులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే 'భూ భారతి' పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. రైతు లాగిన్ అయిన వెంటనే తనకున్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే, అందుకు సంబంధించిన ఫీజు ఎంత చెల్లించాలో చూపిస్తుంది. ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలో ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్ లాగిన్‌కు వెళ్తాయి. ఆ తర్వాత రెండు రోజుల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారు. అనంతరం ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెన్స్‌డ్ సర్వేయర్ ఖరారు చేయడమే కాకుండా, సర్వేను రోవర్లతో (Rovers) పూర్తి చేస్తారు. దీనిని సిస్టమ్‌లో నమోదు చేశాక, అది మండల సర్వేయర్ స్క్రూటినీకి (Scrutiny) వెళ్తుంది. ఆపై మండల తహశీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారైన రైతుకు ఎల్‌పీఎం (LPM), భూధార్ నంబర్లు కేటాయిస్తారు. ఈ వివరాలన్నీ భూ భారతి పోర్టల్‌లో కూడా నిక్షిప్తమవుతాయి. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్‌ను జనరేట్ చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ (SMS) అలర్ట్స్ వస్తాయని మంత్రి వివరించారు.

సర్వే మ్యాప్ తప్పనిసరి..

భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయవిక్రయదారులకు ఇబ్బంది లేకుండా, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్‌కు (ఎల్‌పీఎం) యూనిక్ నంబర్, ప్రతి సర్వే నంబరుకు భూధార్ నంబరు కూడా ఇస్తామన్నారు. సర్వే నిర్వహించడానికి అవసరమైన సర్వేయర్లను అందుబాటులో ఉంచామని, గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామన్నారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి కావడమే కాకుండా, కచ్చితమైన వివరాలు వస్తాయని తెలిపారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ఒక కీలకమైన ముందడుగు అని మంత్రి స్పష్టం చేశారు.

Next Story