ఇండియా కూటమి మహిళలకు తీరని ద్రోహం చేసింది: కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​

by Kema Shiva Kumar |

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లును అడ్డుకున్న ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

ఇండియా కూటమి మహిళలకు తీరని ద్రోహం చేసింది: కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేసి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్​మండిపడ్డారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళలకు తీరని ద్రోహం చేశాయని, వారిని రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేశారని నిప్పులు చెరిగారు. బయట దక్షిణాది గౌరవం అంటూ డ్రామాలు ఆడే విపక్షాలు, పార్లమెంటులో మాత్రం ఆ ప్రాంత గొంతు నొక్కేలా వ్యవహరించడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు.

2026 తర్వాత జరగబోయే డీలిమిటేషన్ జనాభా నియంత్రణ పాటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు రాజకీయ ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉందని, దానిని అడ్డుకునేందుకే ప్రధాని మోడీ రక్షణ కవచం లాంటి బిల్లును తెచ్చారని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది సీట్లను 50 శాతం పెంచేందుకు సిద్ధమని స్పష్టమైన హామీ ఇచ్చినా విపక్షాలు స్పందించకపోవడం దారుణమన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే ఈ చారిత్రక సంస్కరణను అడ్డుకుని, దక్షిణాది ప్రజలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరగబోయే సీట్ల కోతకు విపక్షాలే బాధ్యత వహించాలన్నారు.

Next Story