- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమజ్జనాల్లో 35 హైరైస్ కెమెరాలు, 9 డ్రోన్ కెమెరాలతో గస్తీ : సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్‌లో గణనాథుల విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా, నిరాటంకంగా కొనసాగుతోందని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గణనాథుల విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా, నిరాటంకంగా కొనసాగుతోందని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. వినాయక నిమజ్జనోత్సవంలో కీలకమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా, ఏ ఆటంకం లేకుండా పూర్తయిందని తెలిపారు. నగరంలో ప్రస్తుతం జరుగుతున్న చిన్న చిన్న వినాయక విగ్రహాల శోభాయాత్రలను ప్రధాన విగ్రహాలతో కలుపుతున్నామని పేర్కొన్నారు. నిమజ్జనాల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు అందుబాటులో ఉన్నాయని, గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వచ్చే వాహనాలన్నీ రాత్రి 11 గంటల్లోగా ట్యాంక్ బండ్ కు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
నిమజ్జనానికి తరలివచ్చే విగ్రహాలన్నింటికీ జియో ట్యాగింగ్ చేశామని సీపీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేలా 35 హైరైస్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, 9 డ్రోన్ కెమెరాలతో గస్తీ కాస్తున్నామని పేర్కొన్నారు. రేపు ఉదయం 8 గంటలలోగా నిమజ్జనాల వేడుక ముగుస్తుందని అంచనా వేస్తున్నామని, అవసరమైతే రేపు ట్రాఫిక్ సడలింపు ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 2,54,685 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు సీపీ వివరించారు.
కాగా.. నగర నలుమూలల నుంచి వచ్చే గణనాథుల్ని వీక్షించేందుకు భక్తులు భారీగా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. నేటి అర్థరాత్రి 1 గంట వరకూ మెట్రో సర్వీసులు, రేపు ఉదయం 4 గంటల వరకూ ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. అఫ్జల్ గంజ్, ధూల్ పేట్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే థీమ్ గణేష్ లను చూసేందుకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద భక్తులు చేరుకుంటున్నారు.






