- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూ బకాసురుల పాలనకు హిల్ట్ పాలసీ నిదర్శనం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో భూ బకాసురుల పాలన సాగుతుందనడానికి హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్) ఒక నిదర్శనమని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి రోజుకో స్కాం కు తెరలేపుతున్నారని విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భూ బకాసురుల పాలన సాగుతుందనడానికి హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్) ఒక నిదర్శనమని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి రోజుకో స్కాం కు తెరలేపుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా స్కాం లు, కుంభకోణాలపై శ్రద్ధ పెట్టారని మండిపడ్డారు. మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీవో నెంబర్ 27 హిల్ట్ పాలసీ ను ఉపసంహరించుకోకపోతే తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ రూపొందించి, ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇష్టానుసారంగా రాత్రికి రాత్రికి జీవోలు తీసుకొచ్చి రాష్ట్ర సంపదను లూఠీ చేయాలని ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదని అన్నారు. తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, ఈ హిల్ట్ పాలసీ పై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగుతుందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో క్లెప్టోక్రసి పాలన నడుస్తుందని దుయ్యబట్టారు. సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూఠీ అనే ఉద్యమం త్వరలో వస్తుందన్నారు. కేబినెట్ మంత్రులకు ఇందులో వాటా లేకుంటే ఒక్కరైనా స్పందించే వారని, సీఎం రేవంత్ రెడ్డి తో సహా మొత్తం కేబినెట్ మంత్రులకు ఈ కుంభకోణంలో వాటా ఉందని ఆరోపించారు. గత పాలకులు కిటికీలు తెరిస్తే వీళ్ళు దర్వాజా తెరిచినట్లు బీఆర్ఎస్పాలనలో వందల ఎకరాలు లూఠీ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వేల ఎకరాల భూమి లూఠీ చేసి తద్వారా లక్షల కోట్లు అవినీతి చేసే యోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు కు తెలియకుండానే సీఎం రేవంత్ రెడ్డి ప్యాలెస్ లో కూర్చుండి ఈ పాలసీని డిజైన్ చేసినట్లు కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రికి చెందిన అనుచరులు ముందుగానే ఈ 22 వాడల్లోకి వెళ్ళి 9292 ఎకరాల భూమిని రెక్కీ చేసి ముందే అగ్రిమెంట్లు చేసుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. తక్షణమే జీవో 27 ను రద్దు చేయాలని లేకుంటే ప్రజల మద్దతుతో ఉద్యమిస్తామని హెచ్చరించారు.






