ప్రభుత్వం తరుపున జిన్నింగ్​మిల్లలకు అన్ని రకాల సహకారం అందిస్తాం : మంత్రి తుమ్మల

by Muthe.Rajitha |

రైతుల సమస్యలను రెట్టింపు చేసేలా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగడం సమంజసం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

ప్రభుత్వం తరుపున జిన్నింగ్​మిల్లలకు అన్ని రకాల సహకారం అందిస్తాం : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల సమస్యలను రెట్టింపు చేసేలా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగడం సమంజసం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. నేటి నుండి పత్తి కొనుగోళ్ళు యధాతథంగా ప్రారంభించాలని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలను కోరారు. తక్షణమే అన్ని జిల్లాలలో నోటిఫై చేసిన అన్ని జిన్నింగ్ మిల్లులను ప్రారంభించాలని సూచించారు. జిన్నింగ్ మిల్లుల సమస్యలపై సమ్మె కాకుండా, సామరస్యంగా కేంద్రంతో పోరాటం చేస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

మంగళవారం సచివాలయంలో సీసీఐ సిఎండి, లలిత్ కుమార్ గుప్తా, జిన్నింగ్ మిల్లర్ల అసోషియేషన్ తో సమావేశమై, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై ఒక నివేదిక తయారుచేసి కేంద్ర జౌళిశాఖ అధికారులకు పంపాల్సిందిగా వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్ ను ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తుందని, రైతుల సంక్షేమం కోసం కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా మా ప్రభుత్వం ఇప్పటికే మొక్కజొన్న కొనుగోళ్ల పరిమితిని 18 క్వింటాళ్ల నుండి 25 క్వింటాళ్లకు పెంచి కొనుగోళ్లు చేస్తున్నది.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాఫెడ్ సేకరించే 25శాతం సోయా చిక్కుడు పరిమితిని కూడా ఎకరానికి 6.72 క్వింటాళ్ల నుండి 10 క్వింటాళ్లకు పెంచి సేకరించాల్సిందిగా మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. కౌలు రైతులకు ఇబ్బందులు కలగకుండా నాఫెడ్ తీసుకొచ్చిన ఆధార్ అథెంటికేషన్ తో పాటు మొబైల్ ఒటిపి తో కూడా కొనుగోళ్లు జరపాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతుల ఇబ్బందులు :

రైతుల కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ అనే యాప్ ను తీసుకొచ్చింది. రైతుల నమోదు ప్రక్రియలో, మొబైల్ ఓటిపిలో సమస్యలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏదో ఒక విధంగా యాప్ లో నమోదు చేసుకున్న రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే కేంద్రం మరో నిబంధన పెట్టిందన్నారు. మొదట్లో ఎకరానికి 12 క్వింటాళ్ల లెక్కన కొనుగోలు చేసి, ఒక్కసారిగా ఆ పరిమితిని 7 కు తగ్గించడంతో రైతులు తమ మిగిలిన పంటను ఎక్కడా అమ్ముకోవాలో తేల్చుకోలేని పరిస్థితిని ఏర్పాటు చేసింది.

తేమశాతం అనే మరో కఠిన నిబంధన పెట్టి, రైతులకు ఊపిరిసలపకుండా చేసింది. అప్పటికే రాష్ట్రంలో అకాల వర్షాలు, మొంథా తుపాను వంటి సహజ విపత్తులు వచ్చి, రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికి, అవన్ని పట్టని కేంద్ర ప్రభుత్వం 8నుండి12 శాతం ఉన్న పత్తిని మాత్రమే కొంటామని చెప్పి, రైతుల గోస పెట్టిందన్నారు. జిన్నింగ్ మిల్లులను తామే కేటాయిస్తామని, కేటాయించిన జిన్నింగ్ మిల్లులను ఎల్1 నుండి ఎల్ 12 లుగా విభజించి, జిన్నింగ్ మిల్లర్లను కూడా ఇబ్బందులకు గురిచేసింది.

కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిన జిన్నింగ్ మిల్లుర్లు, పత్తి కొనుగోళ్లు నిలిపేస్తామనే నిర్ణయానికి వచ్చారు. వీటన్నింటికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిన నిర్ణయాలే కారణమన్నారు. జిన్నింగ్ మిల్లర్లకు కేంద్ర తీసుకునే నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే, వారు కేంద్రంతో పోరాడాలని కాని రైతులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదని అభిప్రాయపడ్డారు.

రాజకీయ ఉనికి కోసమే బీఆర్​ఎస్​ఆరాటం :

తమ ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతోనే బిఆర్ఎస్ నాయకులు, లేని గొప్పలు చెప్పుకుంటూ రైతులను, తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు తెలంగాణ రైతులు పడుతున్న కష్టాలు కానరాని ఆపార్టీ నాయకులకు ప్రభుత్వం చొరవ చూపి జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో మాట్లాడి వారిని ఒప్పిస్తే, అదేదో తాము ప్రశ్నిస్తేనే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

పత్తి రైతుల కోసం తమ ప్రజా ప్రభుత్వం తీసుకున్న చొరవ ఎలాంటిదో తెలంగాణ రైతాంగానికి తెలుసునని, బిఆర్ఎస్ నాయకులు మాత్రం కళ్లు ఉన్న కబోదిలాగా ప్రవర్తిస్తున్నారు. పత్తి కొనుగోళ్లలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకున్నా రైతులు ఇబ్బందులు పడొద్దని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, కేంద్ర మంత్రులను, అధికారులకు పలుమార్లు విజ్ఙప్తులు చేశామన్నారు.

Next Story