‘దిశ’ కథనంతో కదిలిన సర్కార్.. అవుట్ సోర్సింగ్‌లో అవినీతికి ఎండ్ కార్డ్

by Kema Shiva Kumar |

అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై చేస్తున్న అవినీతికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టేందుకు సిద్ధమైంది.

‘దిశ’ కథనంతో కదిలిన సర్కార్.. అవుట్ సోర్సింగ్‌లో అవినీతికి ఎండ్ కార్డ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై చేస్తున్న అవినీతికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రతి శాఖలో ఎంత మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు? అందులో ఎంత మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు? అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నది ఎందరు? ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు సొంతంగా ఎంత మందిని నియమించుకున్నారు?.. అనే వివరాలను సేకరిస్తున్నది. ఈ మేరకు స్పెషల్ సీఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలు, హెచ్ఓడీలకు సర్క్యూలర్ జారీ చేసింది. సంబంధిత వివరాలతో సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది.

శాంతికుమారి కమిటీకి బాధ్యతలు

అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో జరుగుతోన్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి కమిటీకి బాధ్యతలు అప్పగించింది. కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ ఎన్.శివశంకర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు ఉన్నారు. ఈ కమిటీ నిర్వహించే సమావేశాలకు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. తమ శాఖల్లో పని చేస్తోన్న రెగ్యూలర్ ఎంప్లాయీస్, టెంపరరీ ఎంప్లాయీస్ వివరాలు తీసుకుని రావాలని పేర్కొన్నది. ఒక్కో శాఖతో ఒక్కో రోజు ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 21న వ్యవసాయం, పశుసంవర్థక శాఖలతో మొదలయ్యే సమావేశాలు పది రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. సమావేశానికి ఆ శాఖలో ఉన్న స్పెషల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ, సెక్రెటరీ,హెచ్ఓడీలు హాజరు కావాలని పేర్కొన్నది.

ఒకే పేరుతో నాలుగు జీతాలు

వివిధ శాఖల్లోని అధికారులు, ఏజెన్సీలు కలిసి అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో ప్రతి ఏటా రూ.కోట్లు కొల్లగొట్టడం పరిపాటిగా మారింది. వర్క్ చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు, వేతనాల చెల్లింపులకు పొంతన ఉండదు. క్షేత్ర స్థాయిలో ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు రికార్డులో కనిపిస్తుంటుంది. ఆ మేరకు హాజరు పక్కగా నమోదు చేస్తుంటారు. వాస్తవానికి తక్కువ సంఖ్యలో ఎంప్లాయీస్ పని చేస్తుంటారు. కొన్ని చోట్ల ఒకే పేరు ఉన్న వ్యక్తి నాలుగైదు సంస్థలో పని చేస్తున్నట్లు రికార్డులుంటాయి. అదనంగా వచ్చిన జీతం సొమ్మును అధికారులు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వాటాలుగా పంచుకుంటారు. ఈ అక్రమాలపై ‘దిశ’ జూలై 18న.. ‘ఒకే పేరు నాలుగు జీతాలు, అవుట్ సోర్సింగ్ భారీ స్కాం’ అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అవుట్ సోర్సింగ్ సేవల్లో జరుగుతోన్న దందాకు చెక్ పెట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి కమిటీకి బాధ్యతలు అప్పగించారు.

సర్య్కూలర్‌లోని అంశాలు

1. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన ఉద్యోగుల సంఖ్య, అందులో మంజూరు చేసిన ఉద్యోగుల సంఖ్య. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య. ఖాళీగా ఉన్న రెగ్యులర్/ తాత్కాలిక పోస్టుల సంఖ్య.

2. ప్రభుత్వ అనుమతితో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయిన ఉద్యోగుల సంఖ్య.

3. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో టెంపరెరీ పద్ధతిలో పని చేస్తోన్న (అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు) వారి వివరాలు.

4. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వల్ల నిలిపి వేసిన టెంపరెరీ ఉద్యోగుల సంఖ్య.

5. శాఖలో ఉన్న పనిభారం దృష్టిలో పెట్టుకుని వాస్తవానికి అవసరమైన పోస్టులు సంఖ్య.

6. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా టెంపరెరీ పద్ధతిలో (అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు) కొనసాగిస్తోన్న ఉద్యోగుల సంఖ్య.

Next Story