ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.. తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-11 17:23:32  IST  )

తెలంగాణ విజన్ 2047 ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు రింగ్ రోడ్లు నిర్మించాలని, ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.. తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి ఇళ్లను కూల్చేసేందుకు ప్రభుత్వానికి ఎంత ధైర్యం అని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా అనే అనుమానం కలిగేలా అర్ధరాత్రి పేదల ఇళ్లను కూల్చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలని.. దీనిపై ప్రభుత్వం వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మీరు రాజ్యాంగం పట్టుకోవటం వృథా అన్నారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితుల ఇళ్లు కూల్చేసిన చోటనే ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం సాయంత్రం విరమించారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రభుత్వం ఆక్రమణదారులు అంటూ వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసిన వారినే ఆ స్థలాలకు యజమానులుగా పేర్కొంటూ టోకెన్లు జారీ చేయడంతో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వెలుగుమట్లలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రజలంతా బాధగా ఉన్నారన్నారు. బాధితులను అవహేళన చేస్తూ వారికి భూమి మీద హక్కులు లేవంటూ మాట్లాడారని.. ఘటన తర్వాత చాలా పార్టీలు టూరిస్టుల మాదిరిగా బాధితుల వద్దకు వెళ్లారని.. కానీ వారి సమస్య పరిష్కారమయ్యేలా పెద్ద ఎత్తున పోరాటం చేయలేదని అన్నారు. అన్ని అర్హతలు ఉన్న వారి ఇళ్లు కూలగొట్టే అధికారం అసలు ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు. ఇలాంటి ఘటనపై ఎలాంటి పోరాటం చేయాలన్న దానిపై విశారదన్ మహారాజ్‌తో మాట్లాడానని.. భూదాన్ భూమి ఎట్టి పరిస్థితుల్లో పేదలకే అప్పగించాలని తాము సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు. భూమి ఆక్రమించుకున్నారని మొన్నటివరకు చెప్పిన మంత్రులు.. తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి అక్కడ అర్హులు ఉన్నారని చెబుతున్నారని అన్నారు. మంత్రులు 310 మందికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ప్రకటించారని.. డిసెంబర్ 9న సీఎం వచ్చి గృహప్రవేశం చేస్తారని భట్టి చెబుతున్నారని.. కానీ, ఇచ్చిన టోకెన్లపై తమకు ఇంకా అనుమానం ఉన్నదన్నారు. లే అవుట్ చేసి ఫిజికల్ ప్రాపర్టీని ప్రతి కుటుంబానికి చూపించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కూల్చిన ఇళ్లను కొంతమంది పది లక్షలతో కొంతమంది 20 లక్షలతో కొంతమంది 30 లక్షలతో కట్టుకున్నారని.. కానీ ప్రభుత్వం మాత్రం అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెబుతున్నదని.. 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తే వారి మిగతా నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగిందా లేదా అన్నది తాము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకుంటామన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య సమక్షంలో మళ్లీ బాధితులతో వెళ్లి మాట్లాడుతామని చెప్పారు. వారందరికీ సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఉన్న కూల్చివేతలను ప్రభుత్వం ట్రయల్‌గా పరీక్షించిందని.. రాష్ట్రంలో ఉన్న లక్షా 74 వేల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని ఆరోపించారు. వాటిని కాజేసే కుట్ర వెలుగుమట్ల నుంచి ప్రారంభించారన్నారు. భూదాన్ భూములన్నీ పేదలకు చెందినవేనని.. వాటిని వారికి పంపిణీ చేయాలని అన్నారు. లేదంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను పేదలకు పంచుతామని వెల్లడించారు. తనపై, విశారదన్‌పై పెట్టిన కేసులు ఎత్తివేయకపోయినా ఫర్వాలేదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Next Story