మిస్ వరల్డ్ పోటీలకు సర్కార్ సమాయత్తం.. ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ

by Kema Shiva Kumar |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

మిస్ వరల్డ్ పోటీలకు సర్కార్ సమాయత్తం.. ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మే 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ పోటీల షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన కార్యక్రమాలు, ఏర్పాటు, వసతి తదితర అంశాలపై టూరిజం, కల్చరల్ శాఖ అధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు సందర్శించే అన్ని ప్రదేశాలను పర్యాటక ఉన్నతాధికారులు సందర్శించి ఏర్పాట్లపైన సమీక్షించారు. చౌమెహల్లా ప్యాలెస్, రామప్ప, యాదాద్రి, పోచంపల్లిలో పరిశీలన పూర్తి చేశారు. మే 6 విదేశాల నుంచి వచ్చే పోటీదారులు, మీడియా ప్రతినిధులు, పోగ్రాం ఆర్గనైజర్లకు స్వాగత ఏర్పాట్లపై టూరిజం,కల్చరల్ మంత్రి జూపల్లి, సెక్రటరీ స్మితా సబర్వాల్ లు అధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు.

గ్రాండ్ వెల్‌ కం..

మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా అతిథులకు మే 6, 7న సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపెనింగ్ సెర్మనీ మే 10 న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. అలాగే మే 12న వచ్చేనెల 12న నాగార్జున సాగర్ లోని కృష్ణానది తీరంలో ఉన్న బుద్దవనాన్ని సందర్శిస్తారు. నాగార్జున సాగర్లోని విజయ విహార్ లో విడిది చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వచ్చేనెల 15న విదేశీ యువతులను ఇక్కత్ వస్త్రాలకు ఫేమస్ అయిన భూదాన్ పోచంపల్లికి తీసుకెళ్లనుంది. ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతలను వివరించడంతో పాటు మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానం, ప్రత్యేకతలను వివరించేలా చర్యలు చేపడుతోంది. చేనేత కార్మికులతో నేరుగా వారితో మాట్లాడించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేకు ట్రాన్స్ లేటర్లను అందుబాటులో ఉంచనుంది. అమ్మాయిలంతా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేయనున్నట్లు సమాచారం.

గద్వాల్ సిల్క్, గొల్లభామ కాటన్, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ ను పోచంపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ హ్యాండ్లూమ్ అనే థీమ్ పెడుతున్నారు. మిస్ వరల్ఢ్ పోటీల్లో పాల్గొనే అమ్మాయిలకు చేనేత దుస్తులు ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందుకోసం స్థానిక, అంతర్జాతీయ డిజైనర్లను ఆహ్వానిస్తోంది. విదేశీ యువతులంతా చేనేత దుస్తులు ధరిస్తే ఆ రంగానికి చేయూతనిచ్చినట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణ పేట వస్త్రాలతో సరికొత్త డిజైన్లతో దుస్తులు తయారు చేసి ధరింపచేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మరోవైపు హస్తకళలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ పోటీల్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రానికి సంబంధించిన హస్తకళలైన సిద్దిపేట చేర్యాల బొమ్మలపై పెయింటింగ్స్, నిర్మల్ బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, వంటి కళాక్రుతులను స్టాళ్లలో ఏర్పాటు చేయనున్నారు.

ఆధ్యాత్మికంపై దృష్టి..

వివిధ దేశాల నుంచి వచ్చే అమ్మాయిలను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడి ప్రాధాన్యతలను వివరించనున్నారు. తద్వారా అంతర్జాతీయంగా ఆ ప్రాంతాలకు గుర్తింపు లభించి టూరిజం వృద్ది చెందుతుందని భావిస్తున్నారు. మే 15న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం పోచంపల్లి వెళ్లేలా టూరిజం శాఖ ప్లానింగ్ లో ఉన్నప్పటికీ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు కన్పిస్తోంది. ఒకే రోజు రెండు చోట్ల పర్యటనలు పెట్టాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తొంది. సమయాన్ని బట్టి యాదగిరిగుట్టపై ఒక డాక్యుమెంటరీ చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.

Next Story