ప్రభుత్వ పథకాలపై కొత్త తరహా ప్రచారానికి ప్రభుత్వం ప్లాన్

by Muthe.Rajitha |

ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నది.

ప్రభుత్వ పథకాలపై కొత్త తరహా ప్రచారానికి ప్రభుత్వం ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నది. ఆ ఫ్లెక్సీలపై వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల వివరాలను అందులో వెల్లడించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్తరేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల డీటెయిల్స్‌ను ఫ్లెక్సీలుగా తయారు చేయించి గ్రామాల వారీగా.. పెద్ద కూడలిలో ఏర్పాటు చేయించాలని సర్కారు భావిస్తున్నది. ఈ విధానంతో లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతతో పాటు సంక్షేమ పథకాలపై ప్రచారం వస్తుందని ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

స్కీమ్‌ల వారీగా ఫ్లెక్సీలు

ఈ నెల 26న కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు మరో మూడు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిచబోతున్నది. సాగుకు ఆమోదయోగ్యమైన ఒక్కో ఎకరాకు ఈ సీజన్ కింద రూ.6వేలు (రైతుభరోసా), భూమి లేని రైతు కూలీలకు సైతం రూ.6వేల చొప్పన ఆర్థిక సాయం (ఆత్మీయ భరోసా) అందించనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ప్రకటించనున్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ పథకాల కింద ప్రయోజనం పొందునున్న లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నారు. అందుకోసం ఆయా గ్రామాల్లో స్కీమ్స్‌‌ వారీగా పెద్దపెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీలైతే గ్రామ సభల సమయంలో లేదంటే ఆ తరువాత మొత్తానికి ఈ నెల 26 లోపు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆఫీసర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఒక్కో గ్రామంలో ఒకటి రెండు చోట్ల..

చిన్న గ్రామాలైతే ఒకచోట.. పెద్ద గ్రామమైతే రెండు, మూడు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఒక్కో స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య, అందుకోసం ఖర్చు చేస్తున్న నిధుల వివరాలను ఇందులో పేర్కొననున్నారు. ఉదాహరణకు ఒక గ్రామంలో రైతు భరోసా కింద ప్రయోజనం పొందుతున్న రైతుల సంఖ్య 1,150 మంది అనుకుంటే.. అందుకోసం ఖర్చు చేస్తున్న నిధులు రూ.35 కోట్లు అని ప్రత్యేకంగా ఓ ఫ్లెక్సీపై ముద్రించి గ్రామ కూడలిలో ప్రదర్శించనున్నారు. అలాగే ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారుల సంఖ్య, అందుకోసం ఖర్చు అవుతున్న నిధుల వివరాలతో మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేయనున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీతో లబ్ధిపొందిన కుటుంబాల వివరాలతో ఇంకో ఫ్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కింద లబ్ధిపొందిన వారి సంఖ్య, అందుకోసం కేటాయించే నిధులను పేర్కొననున్నారు.

కొత్త తరహా ప్రచారం

రుణమాఫీ కోసం ప్రభుత్వం ఒకేసారి దాదాపు రూ.24 వేల కోట్లు ఖర్చు చేసినా అనుకున్న స్థాయిలో ప్రచారం చేయలేకపోయామనే భావన ప్రభుత్వంలో ఉన్నది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి ప్రతి సంక్షేమ పథకానికి గ్రామాల వారీగా ప్రచారం కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. ఈ కొత్త తరహా ప్రచారంతో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకత పాటించామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ప్రభుత్వం భావిస్తున్నది.

Next Story