దొడ్డు బియ్యం పురుగుల పాలు.. ఏడు నెలలుగా పట్టించుకోని సర్కారు

by Kema Shiva Kumar |

ఉగాది నుంచి ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది.

దొడ్డు బియ్యం పురుగుల పాలు.. ఏడు నెలలుగా పట్టించుకోని సర్కారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉగాది నుంచి ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది. అయితే అప్పటికే ఉన్న దొడ్డు బియ్యంపై ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక గోదాముల్లో ఆ నిల్వలు ముక్కిపోతున్నాయి. దొడ్డు బియ్యానికి పురుగులు పట్టి.. పిండిగా మారుతున్నాయి. మరోవైపు సన్న బియ్యం నిల్వ చేయడానికి స్థలం కొరత ఏర్పడుతున్నది. దొడ్డు బియ్యాన్ని బహిరంగ వేలం వేయాలని అధికారులు భావించినా.. అడుగు ముందుకు పడడం లేదు. వీటిని వేలం వేస్తే ప్రభుత్వానికి రూ.450 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది. బెవరేజెస్ ​కంపెనీలు, కోళ్ల ఫారాలకు విక్రయించాలని నాలుగు నెలల క్రితం ప్లాన్​చేశారు. కర్ణాటకలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండడంతో.. అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి సమాచారం పంపారు. వేలంలో ఎక్కువ ధరకు కోట్ చేసిన వారికి ఇవ్వాలని భావించారు. ఇప్పటికే పలుమార్లు దొడ్డు బియ్యం ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోపక్క డీలర్లు కూడా తమ వద్ద దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయని, వాపసు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్నారు. అయితే సర్కారు సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో గత కొన్ని నెలలుగా దొడ్డు బియ్యం నిల్వలు రేషన్ షాపుల్లో, గోదాముల్లో ముక్కిపోతూ.. ఎలుకలకు ఆహారంగా మారుతున్నాయి.

1.15 లక్షల మెట్రిక్ ​టన్నుల నిల్వలు

రాష్ట్రంలోని పలు జిల్లాల గోదాముల్లో 90 వేల మెట్రిక్ టన్నులు, రేషన్ దుకాణాల్లో 25 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం స్టాక్ ఉన్నట్లుఅధికారిక గణాంకాల ద్వారా తెలుస్తున్నది. వీటిని కిలో రూ.40 చొప్పున టెండర్లద్వారా విక్రయిస్తే సర్కారుకు భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకొంత కాలం పట్టించుకోకుంటే.. ముక్కిపోయి సముద్రంలో పారబోసే పరిస్థితి వస్తుందని డీలర్లు చెబుతున్నారు. పాత స్టాక్​ తో సన్న బియ్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే.. వాటిని అక్కడికి తరలిస్తే కొంత నగదు వస్తుందంటున్నారు.

సన్నబియ్యం నాణ్యతపై విమర్శలు

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యత సరిగా లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు మంచి బియ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నా.. మిల్లర్ల ట్రిక్కులతో సర్కారు అప్రతిష్టపాలవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. సీఎంఆర్ ​చేసిన తరువాత పౌరసరఫరాల శాఖ కేటాయించిన బియ్యం ఇవ్వకుండా.. గతంలో దళారుల వద్ద కొనుగోలు చేసిన రేషన్​ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. రేవంత్​ సర్కారును అప్రతిష్టపాలు చేసేందుకు మిల్లర్లు కుట్రలు చేస్తున్నారనే టాక్ ​ఉంది.

Next Story