ఏప్రిల్ 20 నుంచి 'సంక్షేమ వారోత్సవాలు' ప్రత్యేక కార్యాచరణ ప్రకటించిన ప్రభుత్వం

by Prasad Jukanti |

99 డేస్ యాక్షన్ ప్లాన్‍లో భాగంగా ఇవాళ సీఎస్ కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

ఏప్రిల్ 20 నుంచి సంక్షేమ వారోత్సవాలు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 99 డేస్ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు (CS Ramakrishna Rao) జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు.

రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్:

ఈ వారోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ప్రతి రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఖరారు చేశారు

ఏప్రిల్ 20 (శుభ్రత): అన్ని సంక్షేమ విద్యా సంస్థల్లో కిచెన్, పరిసరాలను శుభ్రపరిచే 'క్లీన్‌లీనెస్ డ్రైవ్'. అధికారులు స్వయంగా సందర్శించి పరిశుభ్రతను పర్యవేక్షించాలి.

ఏప్రిల్ 21 (టాలెంట్ ఫెస్ట్): విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు క్విజ్, డిబేట్, డ్రాయింగ్ వంటి పోటీలు నిర్వహించడం.

ఏప్రిల్ 22 (మౌలిక సదుపాయాలు): హాస్టళ్లు, గురుకులాల్లో అవసరమైన చిన్న చిన్న మరమ్మతులను గుర్తించి, వేసవి సెలవుల్లో వాటిని పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయడం.

ఏప్రిల్ 23 (తల్లిదండ్రుల సమావేశం): పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) నిర్వహించడం, ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించడం.

ఏప్రిల్ 24 (నైపుణ్యాభివృద్ధి): యువతకు ఉపాధి అవకాశాలను పెంచేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం.

ఏప్రిల్ 25 (సమ్మర్ క్యాంపులు): విద్యార్థుల కోసం క్రీడలు, కళలు, సంగీతం, డిజిటల్ అక్షరాస్యతతో కూడిన వేసవి శిబిరాలు.

ఏప్రిల్ 26 (బడి బాట): రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టళ్లు, గురుకులాల్లో 'బడి బాట' కార్యక్రమం నిర్వహించడం.

కలెక్టర్లకు కీలక ఆదేశాలు:

కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతిరోజూ జరిగిన పనులపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సీఐపీఆర్ (CIPR) ఛాందసి ప్రియాంక తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story