హామీలన్నీ పూర్తి చేయడమే లక్ష్యం.. ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ ఫోకస్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-03 01:39:24  IST  )

తెలంగాణలో ఎన్నికల హామీల అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

హామీలన్నీ పూర్తి చేయడమే లక్ష్యం.. ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వివిధ వర్గాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఒక్కో హామీని నెరవేర్చాలని కృతనిశ్చయంతో ఉన్నది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండున్నరేళ్లు అవుతున్నందున సమస్యలు, హామీలను అమలు చేయాలని, ఇంకా ప్రతిపక్షాలను విమర్శించలేమనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రెండేళ్లు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వడ్డీలు, అసలు, ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు ఇలా వీటికి కూడా నిధులు సరిపోవడం లేదు.

దీంతో ప్రజలు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇలా కారణాలు చెబితే అంగీకరించబోరని భావిస్తున్నారు. కాంగ్రెస్​ఇచ్చిన హామీల్లో అత్యధికం అమలైనా చేయూత పింఛన్లను రూ.రెండు నుంచి రూ.నాలుగు వేలకు పెంచడం, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసాను ఎకరానికి రూ.15వేలకు పెంచడం, కళ్యాణలక్ష్మి కింద అదనంగా తులం బంగారం, ఆడపిల్లలకు స్కూటీలను ఇవ్వాల్సి ఉంది. వీటికి ప్రజల నుంచి డిమాండ్​అధికంగా ఉంది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను వీటి గురించి ప్రజలు అడుగుతున్నారు. ప్రతిపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది, పీఆర్సీ, డీఏల అమలు చేయాల్సి ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇలా ఉద్యోగులు, రిటైర్డ్​ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. వీటిని అమలు చేయాలంటే వేల కోట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం ద్వారానే వీటి అమలు సాధ్యమవుతుందని ఒక నిర్ణయానికి వచ్చారు. వీటిని అమలు చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూములను వేలం వేయడం, అప్పులు తీసుకురావడం, ఎఫ్ఆర్​బీఎం పరిధిలోకి రాకుండా అప్పులు తీసుకరావడం, ఇప్పుడున్న అప్పులను దీర్ఘకాలిక అప్పలుగా మార్చేలా చేయడం, ఇలా రకరకాల ప్రత్నామ్నాయాలపై దృష్టిపెట్టారు. ఏదైనా చేసి ఎన్నికలకు ఒక ఏడాది ముందుగానే అన్నింటిని నెరవేర్చి ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.

ఉద్యోగుల విషయంలో ముందే అలర్ట్​..

ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారం ప్రభుత్వం ముందే అలర్ట్​అయింది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో వారిని సరిగా డీల్​చేయలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. సమ్మె ప్రారంభమైన రెండవ రోజే ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడంతో పరిస్థితి ఉద్రికత్తకు దారితీసింది. వెంటనే రంగంలోకి దిగిన వెంటనే వారితో చర్చలు జరపాలని, సమ్మె విరమింపచేసే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. తాజాగా ఉద్యోగులు ఈనెల 5వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో సీఎం స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారాన్ని చూపడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. దీంతో తమ నిరసనలను వాయిదా వేసుకున్నారు. లేకుంటే ఉద్యోగులు నిరసనలకు దిగితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇబ్బందికరంగా మారుతుందని, ప్రతిపక్షాలు ఆందోళనలను అస్త్రంగా చేసుకునే అవకాశం ఉందని ముందే గ్రహించిన సీఎం రేవంత్​రెడ్డి వారి సమస్యకు మొగ్గదశలోనే ముగింపు పలికారు. కొన్నాళ్లుగా పెండింగ్​లో ఉన్న పీఆర్సీ, హెల్త్​కార్డు, డీఏలు, బదిలీల తదితర వాటికి పరిష్కారం దొరికింది. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగవర్గం ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తం చేసింది. రిటైర్డ్​ఉద్యోగులకు సైతం వందరోజుల్లో బకాయిలు చెల్లిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇలా అన్నివర్గాలను సంతృప్తిపర్చడం, వారి సమస్యలను పరిష్కరించడం, భరోసా కల్పించడం చేస్తున్నారు.

Next Story