- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ సమస్యలు లేని తెలంగాణే లక్ష్యం
భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా భూభారతి చట్టాన్నితీసుకువచ్చామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా భూభారతి చట్టాన్నితీసుకువచ్చామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుందన్నారు. భూభారతి అవగాహన సదస్సులపై గురువారం మంత్రి సమీక్షించారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే భూభారతి అమలుకు పైలట్ ప్రాజెక్ట్‌లుగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నారాయణ్‌పేట జిల్లా మద్దూర్ మండలంలోని కాజాపురం గ్రామంలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్‌ను తానే స్వయంగా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామంలో జరిగే అవగాహన సదస్సులో పాల్గొననున్నట్లు తెలిపారు. 18వ తేదీన ములుగు జిల్లా వెంకటాపురంలో ఉదయం జరిగే రెవెన్యూ సదస్సులోనూ, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోనూ జరిగే సదస్సులో పాల్గొంటున్నట్లు చెప్పారు.
నాలుగు మండలాల్లో ప్రజల నుంచి దరఖాస్తులు
నారాయణ్‌పేట్ జిల్లా మద్దూర్ మండలం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి చట్టాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా భూభారతిని అమలు చేసే ఈ నాలుగు మండలాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటికి రశీదులను అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫార్మాట్‌లో దరఖాస్తులను రెడీ చేసినట్లు చెప్పారు. వాటిని రెవెన్యూ సదస్సుకు ముందురోజే ప్రజలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎలాంటి భూసమస్యలు ఉన్నాయి? ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి? వాటిని ఏ విధంగా పరిష్కరించాలి? రానున్న రోజులలో చేపట్టాల్సిన చర్యలు ఏంటి? భూభారతి పోర్టల్‌పై ప్రజాస్పందనను చూసి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలి? అనే విషయంపై చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూముల మినహా ప్రతి దరఖాస్తును మే 1వ తేదీ నుంచి పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఏ రోజుకారోజు కంప్యూటర్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు.
ఓ వైపు రెవెన్యూ సదస్సులు.. మరోవైపు అవగాహన సదస్సులు
ఒకవైపు నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూనే మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. ఈ అవగాహన సదస్సులకు కలెక్టర్లు ప్రతిరోజూ రెండు కార్యక్రమాలలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సర్వేయర్ తదితర అధికారులతో బృందాలుగా ఏర్పడి సదస్సులు నిర్వహించాలని సూచించారు. అవగాహన సదస్సులు పూర్తయిన తర్వాత ఆ నాలుగు మండలాలలో నిర్వహించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు.






