- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక కల్తీ మాఫియా ఖేల్ ఖతం.. సీఎం రేవంత్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
తెలంగాణలో ఆహార పదార్థాల కల్తీ మాఫియాపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఆహార కల్తీని అరికట్టేందుకు, కల్తీ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ (Eagle), హైడ్రా (HYDRAA) తరహాలో ఒక అత్యాధునిక అత్యంత కఠినమైన వ్యవస్థను తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆహార భద్రతా చట్టాలను, వ్యవస్థలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని సీఎం తెలిపారు. అధ్యయనం అనంతరం, పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ మాఫియాకు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈగల్, హైడ్రా తరహాలోనే ఈ కొత్త వ్యవస్థకు కూడా విస్తృత అధికారాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించనున్నట్లు సమాచారం.
రైతులను ఆదుకునేందుకు కనీస మద్దతు ధర చట్టం..
రైతుల సమస్యలపైనా సీఎం స్పందించారు. పంటలకు ధర నిర్ణయించే అవకాశం రైతులకు లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఈ దళారీ వ్యవస్థకు చరమగీతం పాడి, రైతులకు సరైన న్యాయం చేసేందుకే తాము కనీస మద్దతు ధర (MSP) చట్టాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఈ చట్టం రైతు హక్కులను కాపాడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అక్రమ నిల్వలపై కఠిన చర్యలు..
నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే పెద్ద నేరమని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే అక్రమ నిల్వదారులను వదిలిపెట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సన్నబియ్యం పథకం అందుకే..
అసెంబ్లీ వేదికగా సన్నబియ్యం పథకం ప్రస్థానాన్ని, దాని విజయాలను వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో విజయభాస్కర్ రెడ్డి హయాంలో ప్రారంభమై, ఎన్టీఆర్ కాలంలో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిన కిలో బియ్యం పథకం దశాబ్దాలుగా దొడ్డు బియ్యం పంపిణీతోనే కొనసాగిందని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ బియ్యాన్ని ప్రజలు తినలేకపోవడం వల్ల అవి మాఫియా చేతుల్లోకి వెళ్తున్నాయని గ్రహించి, పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ‘సన్నబియ్యం’ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇందుకోసం రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి సన్నవడ్ల సాగును ప్రోత్సహించామని, తద్వారా రాష్ట్రంలోని 86 శాతం మంది ప్రజలకు సుమారు 3.39 కోట్లు మందికి లబ్ధి చేకూరుతోందని వెల్లడించారు. ఈ పథకం పంపిణీ నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, బ్లాక్ మార్కెట్ మాఫియాకు అడ్డుకట్ట పడిందని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే తమ తదుపరి లక్ష్యమని, అందుకే రైతులకు పంట మార్పిడి, వాణిజ్య పంటలపై అవగాహన కల్పిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.






