GBS : తెలంగాణలో కలకలం రేపుతున్న తొలి GBS మరణం

by Muthe.Rajitha |

తెలంగాణలో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) మరణం నమోదు అయింది.

GBS : తెలంగాణలో కలకలం రేపుతున్న తొలి GBS మరణం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) మరణం నమోదు అయింది. GBS తో బాధ పడుతున్న మహిళ శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది. సిద్ధిపేట జిల్లా(Siddipeta District) సీతారంపల్లికి చెందిన ఓ మహిళ నెలరోజుల క్రితం GBS బారిన పడింది. తొలుత సిద్దిపేటలో వైద్యం చేయించిన కుటుంబ సభ్యులు.. అనంతరం హైదరాబాద్(Hyderabad) లోని నిమ్స్(Nims) ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుండి ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించి లక్షలు ఖర్చు పెట్టి చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. దీంతో రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం తొలి GBS మరణం నమోదయిందని వైద్యాధికారులు పేర్కొన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో GBS కేసులు వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో 183 GBS కేసులు నమోదు కాగా వారిలో ఆరుగురు మరణించారు. కాగా ఇప్పుడిప్పుడే కరోనా కష్టాల నుంచి మెల్లగా బయట పడ్డ ప్రజల ప్రాణాల మీదికి GBS చాపాకింద నీరులా విస్తరించడం జనాలలో భయాన్ని కలిగిస్తోంది.

GBS లక్షణాలు

కలుషిత ఆహారం.. బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా గిలియన్ బార్ సిండ్రోమ్‌ సోకుతుంది. జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిర్లు, డయేరియా, పొత్తికడుపు నొప్పి, నీరసం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఇలాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఈ వైరస్‌ ప్రధానంగా కలుషిత ఆహారం వల్ల సోకుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్‌(Viral Infection), బ్యాక్టీరియా కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రజలు జీబీఎస్ సిండ్రోమ్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కరోనా వంటి అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. బయట దొరికే ఆహార పదార్థాలు , కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం మానేస్తే దీని బారిన పడే అవకాశం లేనట్లేనని అంటున్నారు.

సకాలంలో వైద్యం తీసుకోండి

ఈ వైరస్ బారిన పడిన ఒకటీ రెండు వారాల్లోనే లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి సకాలంలో వైద్యం అందితే ఎలాంటి ప్రాణహాని ఉండదు. వైద్యం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రాణాలే పోవచ్చు. వ్యాధి సోకిన తొలి దశలోనే ఆస్పత్రిలో చేరితే.. 4 వారాల్లో నయం అయ్యే అవకాశం ఉంది. వ్యాధి ముదిరితే.. కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు లేదా వ్యక్తి మరణించవచ్చు.

Next Story