రేవంత్ సర్కార్‌‌కు రైతుల పాపం తాకుతది.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ధ్వజం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-18 11:20:40  IST  )

‘మేడిగడ్డ’కు మరమ్మతులు చేయకుండా రైతుల పొలాలను ఎండబెడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ సర్కార్‌‌కు రైతుల పాపం తాకుతది.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్, ఇప్పుడు పగటి వేషగాడిలా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇవాళ ఆయన హనుమకొండ (Hanmakonda)లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ధ్వజమెత్తారు. బంగారం లాంటి మంచిగున్న మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda Project)ను రేవంత్ సర్కార్ కావాలనే బద్నాం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, వాటిని చేయకుండా కాలయాపన చేస్తూ ప్రాజెక్టును పనికిరాకుండా చేస్తున్నారని విమర్శించారు.

అన్నదాతలను గోస పెడుతుండ్రుగా..

అదేవిధంగా మేడిగడ్డ పునర్నిర్మాణానికి ఎల్‌ అండ్‌ టీ సంస్థ ముందుకు వచ్చినప్పటికీ.. ఆ విషయం బయటకు చెప్పకుండా ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే నేడు రైతుల పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి (Godavari)లో నీళ్లు ఉన్నా.. కాల్వలకు విడుదల చేయలేక రైతులను గోసపెడుతున్నారని ఫైర్ అయ్యారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ఈ రైతుల పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల హామీలను గాలికొదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story