అధికార పార్టీలో పదవుల పందేరం..! ఆశావాహుల్లో రెట్టించిన ఉత్సాహం

by Kema Shiva Kumar |

టీ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం నెలకొంది.

అధికార పార్టీలో పదవుల పందేరం..! ఆశావాహుల్లో రెట్టించిన ఉత్సాహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం నెలకొంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లూ పూర్తి కావడం, ఇటు లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు హస్తం పార్టీ ఖాళీగా ఉన్న పదవుల భర్తీపై దృష్టి పెట్టింది. తాజాగా మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్​మహేశ్‌కుమార్ గౌడ్ ఈనెలాఖరులోగా నామినేటెడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను భర్తీ చేస్తామని చెప్పడంతో ఈ పదవుల భర్తీపైన ఆశలు పెట్టుకున్న ఆశావాహుల్లో ఉత్సాహం వచ్చినట్లైంది. ప్రస్తుతం నడుస్తున్న పంచాయితీ ఎన్నికలకు ముందే జిల్లా అధ్యక్షుల పదవులను భర్తీ చేసింది. ఇటీవలనే ఏఐసీసీ జిల్లా అధ్యక్షుల పదవులను భర్తీ చేసింది. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేసింది.

టికెట్ దక్కని నేతలకూ హైకమాండ్ హామీ..

కొన్ని జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలు, ముఠా తగాదాలు, వర్గపోరుతో డీసీసీ చీఫ్‌ల నియామకం అంత సులువు కాదన్న ప్రచారం సొంత పార్టీలోనే నెలకొన్న సమయంలో ఏఐసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటించి స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకొని ఆశావాహుల జాబితాను రూపొందించి కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగియగానే కొత్త డీసీసీల చీఫ్​నియామకం పూర్తి చేశారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికలకు ముందే జిల్లా అధ్యక్షుల నియామకం కావడంతో ఇక ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులు భర్తీపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిసారించింది. ప్రభుత్వంలో చాలా కీలక కార్పోరేషన్లకు చైర్మన్లు లేరు. ఈ పదవులపైన నేతలు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనూ టికెట్ దక్కని నేతలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని పార్టీ హైకమాండ్ హామీలు ఇచ్చింది. ఈ క్రమంలో ఈ పదవుల భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్​ చెప్పడంతో ఈ పదవుల భర్తీ కోలహాలం పార్టీలో నెలకొన్నది.

వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవులపై గంపెడాశలు..

మరోవైపు డీసీసీల చీఫ్‌ల నియామకంతో జిల్లా కార్యవర్గాల కూర్పు, ఇటు పీసీసీ కార్యవర్గ కూర్పు కూడా పార్టీ చేపట్టే యోచనలో ఉన్నది. మహేశ్‌కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్‌గా నియామకం అయిన తర్వాత టీపీసీసీలో పదవుల భర్తీ కూడా చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్టులను భర్తీ చేయాలన్న విజ్ఞప్తులను నేతలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దీనితో వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవుల నియామకం ప్రతిష్టాత్మకంగా మారింది. చాలా మంది సీనియర్ నేతలు ఈ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. నాలుగు లేదా ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లగా నియామిస్తారన్న ప్రచారం జరుగుతోంది. సామాజిక వర్గాల వారీగా ఈ పదవులను కట్టబెడతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నేతలు ఈ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. దీనితో పాటు పీసీసీలో కీలకమైన మరో పదవి అధికార ప్రతినిధి పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. టీపీసీసీ కార్యవర్గ పోస్టులకు భారీగా ఆశావాహులున్నారు. ఈ పదవులన్నింటిని రాబోయే కొన్ని రోజుల్లోనే భర్తీ చేసే యోచనలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉండటంతో గాంధీ భవన్ కోలాహాలంగా మారనున్నదని పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ పదవుల భర్తీలో ప్రస్తుతం నడుస్తున్న పంచాయితీ ఎన్నికల్లో ఫలితాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గాల్లో సర్పంచ్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు వచ్చిన వారికి పదవుల భర్తీలో ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయని పార్టీ నేతలు అంటున్నారు. దీనితో పంచాయితీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఆయా నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని టాక్ వినిపిస్తోంది.

Next Story