- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళారుల దోపిడీకి చెక్ పెట్టే ‘కపాస్ కిసాన్’
పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. కొత్త విధానంతో దళారుల దోపిడీకి కళ్లెం పడనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. కొత్త విధానంతో దళారుల దోపిడీకి కళ్లెం పడనుంది. గతేడాది పత్తి కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండా బ్రోకర్లు పెద్ద ఎత్తున సీసీఐకి పత్తిని అమ్మినట్లు బయటపడింది. దీంతో రైతుల కంటే మధ్య దళారులే లాభపడినట్లు గుర్తించింది. వారి ఆగడాలను అదుపు చేసేందుకు సమాలోచనలు చేసిన ప్రభుత్వం.. ఆన్లైన్ విధానం ప్రవేశ పెట్టింది. పత్తిని అమ్ముకోవాలనే రైతులు ముందుగా ‘కపాస్ కిసాన్’ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల్లో పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకోవాల్సి ఉంటుంది. అప్పుడు వీలు కాకుంటే మరోసారి స్లాట్ బుకింగ్ చేసుకొని అమ్మకాలు చేసేలా సీసీఐ వెసులుబాటు కల్పించింది. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల సంఖ్యను సైతం పెంచింది. రైతులు పత్తిని సులభంగా విక్రయించుకునేందుకు జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లులు, గోదాములు అందుబాటులో ఉండేలా కసరత్తు చేస్తున్నది. పత్తి కొనుగోలు చేసిన రైతుల ఖాతాలో ఆలస్యం చేయకుండా వారం రోజుల్లో జమ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నది.
దళారుల అక్రమ దందాకు ముకుతాడు
పత్తి రంగుమారిందని, తేమ ఉందని సీసీఐ కేంద్రాల వద్ద కొర్రీలు పెడుతుండడంతో తప్పని పరిస్థితుల్లో రైతులు దళారులను ఆశ్రయించేవారు.దీంతో దళారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసే వారు. అంతేకాకుండా నెలరోజుల పాటు కూడా నగదు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ విషయంలో పలు ప్రాంతాల్లో రైతులు దళారులపై కేసులు పెట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఆ తర్వాత అదే పత్తిని దళారులు కొందరు సిబ్బంది సహకారంతో సీసీఐకి అమ్మి లాభపడేవారు. ఇప్పుడు ఆన్ లైన్ విధానం రావడంతో దీనికి చెక్ పడనుంది. కపాస్ కిసాన్ యాప్ లో పట్టాదారు పాస్ బుక్ తోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలతో దళారులకు దోపిడీకి కళ్లెం పడుతుంది.
ఈ ఏడాది తగ్గిన పత్తి సాగు
రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి సాగు తగ్గినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. 2024–25లో 44.75 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 2025–26లో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది కంటే 1.46 లక్షల ఎకరాలు తగ్గింది. దీంతో పంట దిగుబడిపై ప్రభావం పడనుంది. గతేడాది రాష్ట్రంలో 28.30 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి కాగా, అందులో 21 లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది సాగు వివరాల ప్రకారం 25 లక్షల టన్నులు ఉత్పత్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పొడువు దూది పింజ పత్తి క్వింటాల్ కు రూ. 8110, తక్కువ దూదిపింజ ఉన్న పత్తి రూ. 7710 మద్దతు ధరను కేంద్రం ప్రకటించింది. గత వారం రోజులుగా వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో కొనుగోలు ప్రారంభమయ్యాయి.






