కేంద్రం కీలక నిర్ణయం.. ఏపీ, తెలంగాణ ఇద్దరికీ ఆహ్వానం

by Gantepaka Srikanth |

గోదావరి-కావేరి(Godavari-Kaveri) నదుల అనుసంధానంపై తాజాగా కేంద్రం కీలక ముందడుగు వేసింది.

కేంద్రం కీలక నిర్ణయం.. ఏపీ, తెలంగాణ ఇద్దరికీ ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి-కావేరి(Godavari-Kaveri) నదుల అనుసంధానంపై తాజాగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఈ బృహత్తర ప్రాజెక్టు అమలుపై భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఈ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి వివరాలను ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజినీర్ (దక్షిణ) పి.దేవేందర్‌రావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ (టీఎఫ్‌ఐఎల్‌ఆర్‌), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుందని తెలిపారు. గోదావరి-కావేరి లింకేజీపై ఇది ఆరో సమావేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కీలక సమావేశానికి హాజరుకావాలని ప్రాజెక్టు పరిధిలోని 10 రాష్ట్రాలకు ఎన్‌డబ్ల్యూడీఏ నోట్ పంపించింది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల, జలవనరుల శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆహ్వానం పంపించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి, రాష్ట్రాల మధ్య ఉన్న సందేహాలను ఈ భేటీలో నివృత్తి చేసి, ఏకాభిప్రాయం సాధించాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది. అందులో భాగంగా ఈ కీలక సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది.

Next Story