‘హైదరాబాద్ మెట్రో’‌పై కేంద్రం చిన్నచూపు.. ఎన్నిసార్లు విన్నవించినా నిధులు శూన్యం

by Kema Shiva Kumar |

దేశంలోని అనేక రాష్ట్రాల్లో మెట్రో రెండో, మూడో దశ విస్తరణకు నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణపై మాత్రం వివక్ష చూపుతున్నది.

‘హైదరాబాద్ మెట్రో’‌పై కేంద్రం చిన్నచూపు.. ఎన్నిసార్లు విన్నవించినా నిధులు శూన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని అనేక రాష్ట్రాల్లో మెట్రో రెండో, మూడో దశ విస్తరణకు నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణపై మాత్రం వివక్ష చూపుతున్నది. అనేకసార్లు విన్నవించినా హైదరాబాద్ రెండో దశ మెట్రోపై స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. డీపీఆర్ లు సమర్పించినా.. ఏదో ఒక సాకుతో సందేహాలు వ్యక్తం చేస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నది. వాటికి వివరణలు ఇచ్చినా.. ఆమోదం లభిస్తుందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతున్నది. మంగళవారం యూపీలోని లక్నో మెట్రో ప్రాజెక్టు-1బీలో 11.16 కిలోమీటర్ల కోసం రూ. 5,801 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అయితే తెలంగాణ మెట్రోకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది.

ఇతర రాష్ట్రాలకు భారీగా నిధులు..

ప్రపంచవ్యాప్తంగా మెట్రో నిర్మాణంలో భారతదేశం మూడో స్థానంలో ఉంది. ప్రతి నెల ఆరు కిలోమీటర్ల మేర మెట్రో లైన్ల నిర్మాణం కొనసాగుతున్నది. మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం 2013–14లో రూ.5,798 కోట్లు వెచ్చించగా.. 2025–26 నాటికి ఇది రూ.34,807 కోట్లకు చేరుకున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 23 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. 2014లో దేశవ్యాప్తంగా 248 కిలోమీటర్ల మేర మెట్రో లైన్స్ ఉండగా.. ఇప్పుడు అది 1,013 కిలోమీటర్లకు చేరుకున్నది. అంటే 11 సంవత్సరాల్లో 763 కిలోమీటర్లు పొడిగించారు. 2013–14లో ప్రతి రోజు 28 లక్షల మంది మెట్రోలో ప్రయాణించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1.12 కోట్లకు చేరుకున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అనేక రాష్ట్రాలకు మెట్రో విస్తరణ కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నది. తాజాగా యూపీలోని లక్నో మెట్రో-1బీలో 11.16 కిలోమీటర్లకు రూ. 5,801 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. మహారాష్ట్రలోని పుణె ఫేజ్-2కు సంబంధించి 12.75 కిలోమీటర్లకు రూ. 3,626 కోట్లు, థానే మెట్రో రైలుకు రూ. 12,200 కోట్లు కేటాయిస్తూ జూన్ లోనే నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఇప్పటికే 75 కిలోమీటర్ల మెట్రోలైన్ ఉండగా.. మరో 145 కిలోమీటర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే మెట్రో ఫేజ్-3 కింద మరో 45 కిలోమీటర్లు లైన్ నిర్మాణానికి కేంద్రం రూ.15,600 కోట్లు మంజూరు చేసింది.

డీపీఆర్‌లు పంపించినా..

హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తుండగా.. జనాభా సైతం పెరుగుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్ లో రోజుకు నాలుగైదు లక్షల మంది మెట్రో ద్వారా ప్రయాణిస్తున్నారు. అయితే దీన్ని విస్తరిస్తే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిచింది. మెట్రోరైలు రెండో దశ (ఏ, బీ)కు సంబంధించి డీపీఆర్ లను తయారు చేసింది. రెండో ద‌శ(ఏ)లో నాగోల్ టు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 36.8 కి.మీ, రాయ‌దుర్గం-కోకాపేట నియోపొలిస్ వరకు 11.6 కి.మీ, ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌ణ‌గుట్ట 7.5 కి.మీ, మియాపూర్‌-ప‌టాన్‌చెరు 13.4 కి.మీ, ఎల్‌బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ 7.1 కి.మీ.. ఇలా మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. రెండోదశ (బీ) ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. ఆర్‌జీఐఏ నుండి భారత్ ఫ్యూచర్ సిటీ (39.6 కి.మీ-రూ.7,168 కోట్లు), జేబీఎస్ నుండి మేడ్చల్ (24.5 కి.మీ- రూ. 6,946 కోట్లు), జేబీఎస్ నుండి శామీర్‌పేట (22 కి.మీ- రూ. 5,465 కోట్లు) మొత్తం 86.1 కి.మీ పొడవును కవర్ చేసే మొత్తం రూ.19,579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కేంద్రం-రాష్ట్రం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేశారు. అన్ని పత్రాలను కలిపి కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ లు పంపించారు.

అనేక సార్లు విన్నవించినా..

హైదరాబాద్ కంటే తక్కువ విస్తీర్ణం, జనాభా ఉన్న దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు కేటాయిస్తున్నది. హైదరాబాద్ రెండో దశ మెట్రో విస్తరణకు ఆమోదం తెలపాలని ప్రధాని మోడీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రతినిధులు అనేకసార్లు కలిసి వినతిపత్రం అందదజేశారు. అయినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదు. రాష్ట్రం పంపించినా డీపీఆర్ లకు కొర్రీలు వేయడానికి అనేక సందేహాలు వ్యక్తం చేసింది. వాటికి రాష్ట్రం వివరణ ఇచ్చింది. అయినా రాజకీయ కారణాలతోనే హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం ఆమోదం తెలపడం లేదని రాష్ట్ర అధికార పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెట్రో విస్తరణలో భాగ్యనగరం వెనకబడిపోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Next Story