- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఉపాధి హామీ’కి కేంద్రం అడ్డుపుల్ల.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉపాధి పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకునే తెలుగు రాష్ట్రాలకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నది. ఆంక్షలు విధించి, షరతులు, నిబంధనలు, ఎక్కడా లేని మార్గదర్శకాలు, అచరణకు సాధ్యం కానీ విషయాలను తెరమీదికి తీసుకువచ్చి తక్కువ సంఖ్యలో పనిదినాలు అయ్యే విధంగా చూస్తోంది. ఈ పథకంపై కేంద్రం వెచ్చించే నిధుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో గత సంవత్సరానికి కంటే సగం పని దినాలు తగ్గాయి. దీనికి కేంద్రం నిబంధనలు, ఆంక్షలే కారణమని అధికారులు చెబుతున్నారు. ఉపాధి హామీ పనులు అత్యధికంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే, జూన్‌లో జరుగుతాయి. ఈ 3 నెలల్లోనే అత్యధిక శాతం పనులు, పని దినాలు నమోదవుతాయి. ఎండకాలం కావడం, ఆ సమయంలో వ్యవసాయ పనులు లేకపోవడం, మట్టి పనులు, ఇతర పనులకు ఇదే అనువైన సమయం కావడంతో ఎక్కువ శాతం పనులు అవుతాయి. ఈ సమయంలోనే దాదాపుగా 70 నుంచి 80 శాతానికిపైగా నిధులు ఖర్చు అవుతాయి. కూలీల పని, మెటీరియల్ కాంపోనెంట్ తదితరాలు ఇప్పుడే ఎక్కువ అవుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం షరతులు, ఆంక్షలు విధించింది.
చట్టం లక్ష్యానికి తూట్లు..
ఉపాధి హామీకి కేటాయించిన బడ్జెట్‌ను మొదటి 6 నెలలు అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 60 శాతానికి కంటే ఎక్కువగా నిధులు ఖర్చు చేయడానికి వీలు లేదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తక్కువ పనిదినాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎన్ని రోజులు పని కల్పిస్తే అన్ని రోజులు పని ఇవ్వాలనే చట్టం లక్ష్యానికి కేంద్రం తూట్లు పొడుస్తోంది. వర్షకాలంలో ఉద్యానవన పంటల పనులు సాగుతుంటాయి. వీటికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించారు. పండ్ల తోటలు, మొక్కలు, వాటిలో కలుపుతీయడం, గుంతలు తీయడం, ఇలా రకరకాల పనులకు ఉపాధి హామీ పథకం కార్డు ఉన్న వారు చేసుకుంటారు. వారికి నిధులు జమ అవుతాయి. 60 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధనతో పథకం లక్ష్యం నీరు గారే అవకాశం ఉందని అధికారులు, కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో మొదటి ఆరు నెలల్లో తెలంగాణ, ఏపీలు 84 శాతం వ్యయాన్ని ఖర్చు చేశాయని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు నష్టమే..
ఉపాధి హామీ చట్టాన్ని అత్యధికంగా సద్వినియోగం చేసుకునే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి. అత్యధికంగా నిధులు, పని దినాలను వినియోగించుకునేది ఈ రాష్ట్రాలే కావడం గమనార్హం. ఉపాధి హామీ పని దినాలు తగ్గితే మెటీరియల్ కాంపోనెంట్ శాతం కూడా తగ్గుతుంది. దీంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, భవనాల నిర్మాణ పనులకు నిధుల లభ్యత తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. దీనితో పాటుగా ఉపాధి హామీ పని దినాలు, వారికి చెల్లించే మొత్తానికి అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు మంజూరు అవుతాయి. నిర్వహణ వ్యయం కింద 6 శాతం మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంది. అయితే పని దినాలు, పని మొత్తం తగ్గుతుందని, ఈ నేపథ్యంలో వారి వేతనాలు కూడా ఆలస్యం అవుతున్నాయని చెబుతున్నారు.
కొత్త మార్గదర్శకాలు ఇవే..
తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పనులు, కూలీల ఫొటోల నమోదు గురించి ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ యాప్‌లో అనేక లోపాలున్నాయని అనేక మార్లు పలు స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ లోపాలన్ని ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీంతో తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కూలీల ఫొటోలను అన్నింటినీ గ్రామ పంచాయతీ స్థాయిలో మాన్యువల్‌గా పరిశీలించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది. అంటే ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నట్లుగా రోజుకు రెండు సార్లు ఫొటోలను ఆప్‌లోడ్ చేయాలని, చేసిన ప్రతి ఫొటోను ఆ గ్రామ పంచాయతీ అధికారులు మాన్యువల్‌గా పరిశీలించాలి. ఆ ఫొటో సరైనదా? కాదా నిర్ధారించాలి. ఆ మండలంలో జరిగే పనుల్లో మండలానికి చెందిన గ్రామీణాభివృద్ధి అధికారులు 20 శాతం ఫొటోలను పరిశీలించాలి. రాష్ట్ర స్థాయిలో అయితే 5 శాతం ఫొటోలను స్వయంగా అధికారులు పరిశీలించాలని కేంద్రం పేర్కొంది. ఇలా అయితే వేల ఫొటోలను ఎలా పరిశీలించాలని మండల, రాష్ట్ర స్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఆచరణకు సాధ్యమయ్యే పనేనా? అంటూ నిట్టూరుస్తున్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే ఇలాంటి ఆదేశాలు ఇస్తోందంటూ విమర్శిస్తున్నారు.






