- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణను వదలని బెట్టింగ్ రక్కసి.. దేశ భద్రతకే ముప్పుగా మారిన యాప్‌లు!
నిషేధంలో ఉన్న చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, హవాలా మూలాలపై కేంద్ర హోం శాఖ, సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాద మోపుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కేవలం రూ.100తో మొదలుపెట్టి లక్షలు సంపాదించండి..’ అంటూ ఆకర్షణీయమైన వెబ్‌సైట్, రంగురంగుల గ్రాఫిక్స్, అగ్ర హీరోల ఫొటోలతో కూడిన ప్రకటనలు ఊరిస్తాయి. తీరా ఆ ఉచ్చులో పడితే.. జేబు ఖాళీ అవడమే కాదు, జీవితాలే బలవుతున్నాయి. తెలంగాణలో ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చైనా మూలాలున్న ఫన్ 88 వంటి యాప్‌లు దేశ భద్రతకే ముప్పుగా మారాయని గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, వాటి వెనుక ఉన్న ఆర్థిక మూలాలను కత్తిరించేందుకు ఆపరేషన్ మొదలు పెట్టిన్నట్టు సమాచారం.
నిషేధం ఉన్నా..
ఆన్‌లైన్ జూదంతో జరుగుతున్న అనర్థాలను పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం, 2017లోనే గేమింగ్ చట్టానికి సవరణలు చేసి ఇలాంటి యాప్‌లను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించింది. అయితే, ఇప్పటికీ ఈ కేటుగాళ్లు చట్టంలోని లొసుగులను వాడుకుంటూ, సాంకేతికతను ఆసరాగా చేసుకుని విరుచుకుపడుతున్నారు. విదేశీ సర్వర్ల ద్వారా నడిచే ఈ వెబ్‌సైట్లు.. ఐపీ అడ్రస్‌లను మారుస్తూ, వీపీఎన్‌ల సాయంతో ఇంకా ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. ఫన్88 లాంటి యాప్‌లు తమ డొమైన్ పేర్లను నిరంతరం మారుస్తూ (ఫన్ 88 ఇండియా, ఫన్ 88 ఆసియా) పోలీసుల కళ్లు గప్పుతున్నారు.
కుటుంబాలను కూల్చుతున్న బెట్టింగ్
రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన వరుస ఘటనలు ఈ బెట్టింగ్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సుమారు రూ.30 లక్షలు బెట్టింగ్‌లో పోగొట్టుకుని, అప్పుల వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. వరంగల్‌లో ఒక విద్యార్థి తన తండ్రి రిటైర్మెంట్ డబ్బును మొత్తం ఈ యాప్‌లలో పెట్టి పోగొట్టుకున్నాడు. ఇలాంటివి బయటకు తెలిసినవి కొన్ని అయితే, పరువు పోతుందనే భయంతో బయటకు చెప్పలేక కుమిలిపోతున్న కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. కేవలం డబ్బు పోవడమే కాదు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి బ్లాక్‌మెయిలింగ్ కు పాల్పడుతున్నారు.
చైనా లింకులు.. హవాలా మార్గాలు
కేంద్ర హోం శాఖ విచారణలో.. భారత్‌లో బెట్టింగ్ ద్వారా వసూలవుతున్న సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో లేదా బోగస్ కంపెనీల పేరుతో హవాలా మార్గంలో చైనాకు తరలించి.. ఈ నిధులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఫన్ 88 సహా 230కి పైగా చైనా అనుబంధ యాప్‌లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. తెలంగాణ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం ఈ గ్యాంగ్‌లను పట్టుకోవడానికి ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది అని సమాచారం.
సెలబ్రిటీల ప్రచారమే శాపమై..
ఈ అక్రమ యాప్‌లు ఇంత త్వరగా జనాల్లోకి వెళ్లడానికి కారణం సినీ గ్లామర్. స్టార్ హీరోల ఫొటోలను, పాత వీడియోలను వాడుకుని ఇవి నిజమైన గేమింగ్ యాప్‌లనే భ్రమను కల్పిస్తున్నారు. అగ్ర తారలు ప్రచారం చేస్తుండడంతో సామాన్యులు నమ్ముతున్నారు. అయితే, ఇలాంటి నిషేధిత యాప్‌లను ప్రమోట్ చేయడం నేరమని, సెలబ్రిటీలైనా సరే చట్టం ముందు సమానమేనని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు ప్రచారకర్తలకు పోలిసులు నోటీసులు పంపడం ద్వారా గట్టి సంకేతాలను పంపింది.
అనుమానాస్పద లింకులతో జాగ్రత్త
డబ్బు పోతే తిరిగి వస్తుంది కానీ, ప్రాణం పోతే రాదు. తక్కువ కాలంలో కోట్లు సంపాదించాలనే ఆశే మీకు శత్రువు. మీ ఫోన్‌లో ఇలాంటి యాప్‌లు ఉంటే వెంటనే తొలగించాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవ ద్దు. తెలంగాణలో ఈ బెట్టింగ్ నెట్‌వర్క్‌ను పూ ర్తిగా తుడిచిపెట్టే వరకు కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు తమ వేటను కొనసాగిస్తూనే ఉంటాయి. - వి.అరవింద్‌బాబు, సైబర్ క్రైమ్, డీసీపీ, హైదరాబాద్






