- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ - ఆంధ్రా జల వివాదం.. ఫైనల్ కాని అధికారుల పేర్లు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్ద కాలం ముగిసిపోయినా జల వివాదాలు మాత్రం ఇప్పటికీ సమసిపోవడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్ద కాలం ముగిసిపోయినా జల వివాదాలు మాత్రం ఇప్పటికీ సమసిపోవడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ వివాదం మరింత తారాస్థాయికి చేరుకుంది. బనకచర్లను నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేంద్రానికి వివరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో కేంద్రం స్పందించకుంటే న్యాయస్థానాల వరకూ వెళ్తామని హెచ్చరించింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యను పుల్‌స్టాప్ పెట్టాలని కేంద్రం భావించింది. ఇటీవల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల నుంచి పేర్లు పంపించాలని కోరారు.
ఫైనల్ కాని అధికారుల పేర్లు
ఢిల్లీలో నిర్వహించిన భేటీకి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్‌తో సహా ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. అయితే.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్రం కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ కేవలం బనకచర్ల మీదనే కాకుండా.. ఇతర అన్ని సమస్యలపైనా స్టడీ చేసి పరిష్కారం చూపనుంది. మొత్తం 12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలియగా.. అందులో ఇరు రాష్ట్రాల నుంచి ఐదుగురి చొప్పున పేర్లు పంపించాలని కోరినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల నుంచి పది మందిని ఎంపిక చేసి.. కేంద్రం తరఫున మరో ఇద్దరు నిపుణులను కమిటీలో ఉంచనున్నట్టు సమాచారం. అయితే.. ఈ కమిటీకి సభ్యులను ఎంపిక చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఎవరెవరిని నియమించాలనే దానిపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
ఏపీ జాబితా వచ్చాకే..
కమిటీలో సభ్యులుగా ఏపీ ప్రభుత్వం సైతం ఐదుగురిని ఎంపిక చేసి పేర్లు పంపించాల్సి ఉంది. దాంతో ఏపీ ప్రభుత్వం పంపే జాబితాను పరిశీలించిన తర్వాతే.. వారికి దీటైన వారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదని సమాచారం. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తమ సభ్యుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలిసింది. ఇందులో ఏపీ ఇరిగేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్, జల వనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వర్‌రావు, ఈఎన్సీ నరసింహామూర్తితో పాటు మరో ఇద్దరి పేర్లు ఖరారైనట్లు సమాచారం. అయితే.. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ జాబితాను కేంద్రానికి పంపించలేదు. వారు సైతం తెలంగాణ పంపించే జాబితా కోసమే వేచిచూస్తున్నట్లు తెలుస్తున్నది. సాంకేతిక చర్చల్లో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ఈ వ్యూహాన్ని ఇరు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని సమాచారం.
21తోనే ముగిసిన గడువు
ఇరు రాష్ట్రాల మధ్య జల జగడానికి చెక్ పెట్టేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల పేర్లను ఈ నెల 21వ తేదీలోపే పంపించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కోరింది. కానీ.. ఇరు రాష్ట్రాలు సైతం సభ్యుల పేర్లను ఇంకా పంపించలేదు. ఈ నెల 16న ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించి.. కమిటీ ఏర్పాటుపై మార్గం సుగమం చేసింది. అయితే.. కమిటీ పేర్లను పంపిస్తే కేంద్రం తరఫున ఇద్దరు నిపుణులను ఎంపిక చేసి తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.






