మైనార్టీ శాఖపై ఆ లీడర్ పెత్తనం.. అధికారులందరికీ ఆయన మాటే వేదం!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని మైనార్టీ శాఖలో ఓ నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్న లీడర్ హవా నడుస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

మైనార్టీ శాఖపై ఆ లీడర్ పెత్తనం.. అధికారులందరికీ ఆయన మాటే వేదం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మైనార్టీ శాఖలో ఓ నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్న లీడర్ హవా నడుస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన డైరెక్షన్‌లోనే రెగ్యూలర్ యాక్టివిటీస్ నుంచి మొదలుకుని విధాన పరమైన నిర్ణయాలు సైతం జరుగుతున్నట్టు సమాచారం. మైనార్టీ శాఖ సెక్రెటరీ షఫీ ఉల్లాతో పాటు ఇతర ఫీల్ట్ లెవల్ ఆఫీసర్లు సైతం సదరు లీడర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్.

గ్రీన్‌ సిగ్నల్ ఇస్తేనే డిప్యూటేషన్లు, ప్రమోషన్లు

మైనార్టీ శాఖలో ఏ పనైనా తాను చెప్పినట్టుగానే చేయాలని సదరు నేత మౌఖిక ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. శాఖకు చెందిన అధికారులందరూ ఆయన మాటలకే ప్రయారిటీ ఇస్తున్నట్లు టాక్. కొత్తగా ఏ స్కీమ్స్ అమలు చేయాలి? ప్రస్తుతం ఉన్న స్కీమ్స్‌ ఏ విధంగా కొనసాగించాలి? అనే అంశాలపై ఆయనే సమీక్ష చేస్తారని తెలిసింది. కొంత కాలం క్రితం మైనార్టీ గురుకులాల్లో పనిచేసే స్టాఫ్‌కు ప్రమోషన్లు కల్పించారు. ఇందులో సదరు లీడర్ ఎక్కువగా జోక్యం చేసుకున్నాడని, ఆయన సిఫారసు చేసిన వ్యక్తులకు ప్రయారిటీ ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారనే చర్చ ఇప్పటికీ జరుగుతున్నది. ఉద్యోగులకు డిప్యూటేషన్ కావాలంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే అధికారులు ఫైల్ పెడతారని, ఈ మధ్య జరిగిన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ భర్తీలోనూ ఆయన సన్నిహితులకే పెద్ద పీట వేశారనే ఆరోపణలున్నాయి.

జూబ్లీహిల్స్ వివాదానికి అతడే మూలం

ఈ మధ్య కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిగ్‌గా మారిన జూబ్లీహిల్స్ వివాదానికి సదరు లీడరే ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నుంచి అనుమతి తీసుకోకుండానే ఆయన సొంతంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అనుకున్న టైంకు మంత్రి ప్రోగ్రామ్‌కు రాకపోవడంతో వేదికపై ఉన్న మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో సదరు లీడర్ తన పరపతిని పెంచుకునేందుకు మైనార్టీ శాఖ అధికారులపై ఒత్తిడి పెట్టి మరీ ఆ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

సెక్రెటరీ షఫీ ఉల్లాపై మంత్రి సీరియస్

సహజంగా బ్యూరోక్రట్స్ సంబంధిత శాఖ మంత్రి చెప్పినట్లు పని చేస్తుంటారు. కానీ మైనార్టీ శాఖ సెక్రెటరీ షఫీ ఉల్లా మాత్రం నామినేటెడ్ పదవిలో ఉన్న కాంగ్రెస్ లీడర్ చెప్పినట్లు పని చేస్తున్నారని మంత్రి అడ్లూరి గుర్తించినట్లు తెలిసింది. రెండు, మూడు అంశాల్లో ఆధారాలతో సహా పట్టుకున్న మంత్రి.. సెక్రెటరీని పిలిచి సీరియస్‌గా క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ‘నేను బాధ్యతలు తీసుకోక ముందు ఏం జరిగిందో తెలియదు. ఇప్పటి నుంచి నా నోటీసులో లేకుండా ఏ నిర్ణయాలూ తీసుకోవద్దు. అలా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉంటేనే వర్క్ చేయండి’ అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

Next Story