కేసీఆర్ అందుకే బయటకు వస్తున్నడు: ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్, అక్రమ నిఘాపై ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ అందుకే బయటకు వస్తున్నడు: ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో గత ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ వైఫల్యాలను, ప్రస్తుత ప్రభుత్వ మార్పులను ఎండగట్టారు. గత పదేళ్లలో రాష్ట్రంలో భయాందోళనల మధ్యే పాలన సాగిందని కోదండరాం ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరిపై నిఘా ఉండేదని కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాపింగ్ చేసేవాళ్లని.. రాజకీయ నాయకులు, మేధావులు ఎవరిని కలవాలన్నా భయపడే పరిస్థితి ఉండేదన్నారు. నిజమైన భయం అంటే ఏంటో గత ప్రభుత్వం ప్రజలకు చూపించిందని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి వేధింపులు లేవని, అక్రమ నిఘా లేదని కోదండరాం పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు దూరంగా ఉండే ఏ పార్టీ అయినా మనుగడ సాగించలేదని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) ప్రస్తుతం జిల్లాల పర్యటనలు చేస్తుండటంపై స్పందిస్తూ.. ప్రజలకు దూరంగా ఉంటే ఏ పార్టీ బతకదు అన్న విషయం అర్థమైంది కాబట్టే, కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాతైనా గత పాలకులకు ప్రజాభిప్రాయం విలువ తెలిసి వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్వేచ్ఛాయుత వాతావరణం ఉందని, ప్రజల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోదండరాం తెలిపారు.

Next Story