Bhatti Vikramarka: బీసీల్లో ముస్లింమైనార్టీలను చూపడానికి కారణం ఇదే: భట్టి విక్రమార్క

by Prasad Jukanti |   (  Updated:2025-02-22 10:17:12  IST  )

బీసీల్లో ముస్లింమైనార్టీ జనాభా చూపడానికి కారణం ఇదే: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: బీసీల్లో ముస్లింమైనార్టీలను చూపడానికి కారణం ఇదే: భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అది జరగకూడదనే ఉద్దేశంతో కులగణనపై (Caste Census) బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేస్తున్నాయని దీన్ని బీసీ కుల సంఘాలు అర్థం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా కులగణన చేశామన్నారు. సర్వేలో పాల్గొనని వారికోసం మరో అవకాశం ఇచ్చామన్నారు. ఈ వివరాలు వచ్చాక వచ్చిన లెక్కలు అప్ డేట్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణనపై అనుమానాల నివృత్తికి ఇవాళ ప్రజాభవన్ లో (Praja Bhavan) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ప్రభుత్వం సమావేశం అయింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు నరేందర్ రెడ్డితో పాటు బీసీ (BC) సంఘాల నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీసీ కులగణన జరగడం ఇష్టం లేని కొందరు ముస్లిం మైనార్టీలను బీసీల్లో ఎలాచూపుతారని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం కొన్ని ముస్లింమైనార్టీ(Muslim Minority) కులాలు బీసీల్లో ఉన్నాయని దాని ప్రకారమే ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొన్న వారిది ఏ కులమో ఆ కులంలో నమోదు చేశారని స్పష్టం చేశారు. ఇవేమి మేము కొత్తగా ఇచ్చిన జీవో కాదన్నారు. ఈ ఆరోపణలు చేస్తున్నవారు ఆ జీవోలు చూడలేదేమో అని ఎద్దేవా చేశారు. అలాగే ఓసీల జనాభా పెరిగిందనే చర్చ జరుగుతోంది. వలసల్లో భాగంగా చాలా కాలంగా అర్బన్ ప్రాంతాల్లోకి మార్వాడీలు, ఇతర ఓసీలు నివాసం ఉంటున్నారు. వారి జనాభా ఓసీల్లో వస్తారని అందువల్లే ఓసీ జనాభా (OC Population) పెరిగిందన్నారు. ఎలాంటి భేషజాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.

బ్యాలెట్ పేపర్ల మాదిరిగా సర్వే పత్రాలు భద్రం:

బ్యాలెట్ పేపర్లు భద్రపరిచే విధంగా కులగణన సర్వే పత్రాలను డిజిటలైజ్ చేసి వాటిని మండలాల్లో భద్రపరిచామన్నారు. ఈ వివరాలు ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లెక్కలు కట్టి రాష్ట్రప్రభుత్వం నియమించిన ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని సబ్ కమిటీకి నివేదిక అందించింది. అంతాపకడ్బందీగా జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 56 శాతం ఉందన్నారు. మిగిలిన వారికి ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మరోసారి సర్వేలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చామన్నారు. మొత్తం మూడు మార్గాల ద్వారా సర్వేకు ప్రభుత్వం చాన్స్ ఇచ్చిందన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించడం, ఆన్ లైన్ లో సర్వే పత్రాలు డౌన్ లోడ్ చేసుకుని వాటిని మాకు పంపడం, మండల, డివిజన్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో సర్వే పత్రాలు ఇవ్వొచ్చు అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు అందుకోసమే:

మొట్టమొదటి సారి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను చాలెంజ్ గా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం దేశానికి మార్గదర్శకంగా నిలబడేలా కులగణన చేశామన్నారు. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదని, నిటారుగా నిలబడి సమాధానాలు చెప్పేంత సమాచారం ప్రభుత్వం వద్ద నిక్షిప్తం అయి ఉందన్నారు. కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరిగితే రాజకీయంగా నష్టపోతామనే కుట్రతో బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనతో రేపు దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందనే భయంతో సర్వేను తప్పించుకోవాలని బీజేపీ విమర్శలు చేస్తోందన్నారు.

Next Story