అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరణపై TGHRC ఆందోళన

by Ramesh Naini |

రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యా కార్యాలయాల్లో (MEOలు) మెసెంజర్లు (ఆఫీస్ సబార్డినేట్లు)గా అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం చెల్లించకపోవడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆందోళన వ్యక్తం చేసింది.

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరణపై TGHRC ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యా కార్యాలయాల్లో (MEOలు) మెసెంజర్లు (ఆఫీస్ సబార్డినేట్లు)గా అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం చెల్లించకపోవడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆందోళన వ్యక్తం చేసింది. డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కమిషన్ ఈ అంశాన్ని పరిశీలించింది. ఇరవై సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్నప్పటికీ, 11.06.2021 తేదీ గల G.O.Ms.No.60 ప్రకారం నెలకు రూ.15,600/- వేతనం చెల్లించాల్సి ఉండగా, తమకు కేవలం రూ.11,050/- మాత్రమే చెల్లిస్తున్నారని ఉద్యోగులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదే విధమైన విధులు నిర్వహిస్తున్న ఇతర శాఖల ఉద్యోగులకు ఎక్కువ వేతనం అందుతున్నట్లు వారు పేర్కొన్నారు.

ఈ పరిస్థితి ఉద్యోగుల జీవనోపాధి హక్కు, గౌరవంతో జీవించే హక్కుకు విఘాతం కలిగిస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ అంశంపై సమగ్ర విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించిన కమిషన్, తెలంగాణ సర్వశిక్ష అభియాన్ (TSSA) ఎక్స్-ఆఫిషియో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో పాటు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నుంచి సవివర నివేదికను కోరింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కోసం కేసును 2026 జనవరి 5వ తేదీకి వాయిదా వేసినట్లు కమిషన్ తెలిపింది.

Next Story