- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 2 నాటికి పీఆర్సీని ప్రకటించాలి: ఎంప్లాయిస్ జేఏసీ
ఉద్యోగులకు జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగులకు జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. పెండింగులో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. శుక్రవారం తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పరిష్కార మార్గాలపై జేఏసీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులందరూ సుదీర్ఘంగా చర్చించారు. అనేక డిమాండ్లలో ప్రభుత్వం సత్వరం పరిష్కరించాల్సిన పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలనని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేసి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉద్యోగులు, వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు. అలాగే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానమును అమలు చేయాలన్నారు.
జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ..
పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. త్వరలో జనాభా లెక్కల కార్యక్రమం ఉన్నందున ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న మండల, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహశీల్దార్లకు మెమోరాండంలు ఇచ్చి ప్రభుత్వానికి నివేదిక చేరేలా చూడాలని, మే 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లుకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కె. రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బాణాల రాంరెడ్డి, టీజీఆర్ఎస్ఏ ఉపాధ్యక్షులు భిక్షం, రాష్ట్ర కోశాధికారి మల్లేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షులు కె. హన్మంత్ రావు, తెలంగాణ కమర్షియల్ టాక్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్, తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జీ. కృపాకర్, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె. రాములు, అనేక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






