TG Vs AP: కృష్ణా జలాల కోసం ‘యుద్ధం’.. నేడు కేఆర్ఎంబీ కీలక భేటీ!

by Kema Shiva Kumar |

కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. తాగునీటి కోసం ఏపీ 10 టీఎంసీలు కోరగా, తమకు 18 టీఎంసీలు అవసరమని తెలంగాణ అవసరం ఉందని పేర్కొంది.

TG Vs AP: కృష్ణా జలాల కోసం ‘యుద్ధం’.. నేడు కేఆర్ఎంబీ కీలక భేటీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా నదీ జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ కుడి కాలువ ద్వారా 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. ప్రస్తుతం నీరు విడుదల చేస్తే తెలంగాణలో తీవ్ర తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు నేడు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఏపీ నీటిపారుదల శాఖ ఈఎన్సీ ఏప్రిల్‌ 29న కేఆర్ఎంబీకి లేఖ రాయగా.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా మే 31 వరకు తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. దీనికి స్పందించిన తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ఈఎన్సీ ఈ నెల 2న బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి జులై వరకు మొత్తం 18 టీఎంసీల తాగునీటి అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో శ్రీశైలం జలాశయం నుంచి 5 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ నుంచి 13 టీఎంసీలు అవసరమని వివరించారు. హైదరాబాద్‌ నగరం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని, ప్రస్తుతం ఏపీకి నీరు విడుదల చేస్తే తెలంగాణలో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

నేడు జలసౌధలో భేటీ..

ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించేందుకు నేడు హైదరాబాద్‌లోని జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఉదయం 11 గంటలకు నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, విడుదలపై చర్చించనున్నారు. అనంతరం 14న జరగనున్న కేఆర్ఎంబీ 21వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల పంపకాల అంశం తరచూ వివాదాస్పదంగా మారుతూ వస్తున్నది. ముఖ్యంగా వేసవిలో నీటి నిల్వలు తగ్గిపోతుండటంతో తాగునీటి అవసరాలు రెండు రాష్ట్రాలకు పెద్ద సవాల్‌గా మారాయి. ప్రస్తుతం సాగునీటి కంటే తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story