Sarpanch Elections: ముగిసిన రెండో విడత పోలింగ్.. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ

by Prasad Jukanti |   (  Updated:2025-12-14 07:56:08  IST  )

మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.

Sarpanch Elections:  ముగిసిన రెండో విడత పోలింగ్.. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ (Second Phase Panchayat Polling Completed) ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. దీంతో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుని వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్‍లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 192 మండలాల్లోని 3,911సర్పంచ్ లు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిశాక గంట సేపు భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు (Panchayat Election Results) ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడత పోలింగ్‍లో పలు చోట్ల స్పల్ప ఘర్షణలు, ఉద్రిక్తతలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న చోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

ఫలితాలపై ఉత్కంఠ:

మరికాసేపట్లో వెలువడనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజాప్రతినిధుల పొలిటికల్ కెరీర్‍లో సర్పంచ్ పదవి మొదటి మెట్టు కావడంతో ఈ రాజకీయ పరీక్షలో ఎవరు పాస్ కాబోతున్నారు మరెవరు ఫెయిల్ కాబోతున్నారు అనే ఉత్కంఠ ఇటు అభ్యర్థులు, ఆయా గ్రామ ప్రజల్లో నెలకొంది. ఇక మొదటి విడతలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్న నేపథ్యంలో రెండో విడతలో పరిస్థితి ఎలా ఉండబోతోందనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. మొదటి విడత ట్రెండే రెండో విడతలో కొనసాగుతుందా లేక ట్రెండ్ తారుమారు అయి మూడో విడతపై మరింత సస్పెన్స్ క్రియేట్ చేస్తుందా మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

READ MORE ...

కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 9 వరకు 22.54 శాతం పోలింగ్ నమోదు

Next Story