మే 13, 14న టీజీ ఐసెట్.. ఏర్పాట్లు పూర్తి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొ. అల్వాల రవి ఒక ప్రకటనలో తెలిపారు.

మే 13, 14న టీజీ ఐసెట్.. ఏర్పాట్లు పూర్తి
X
  • 69 కేంద్రాల్లో పరీక్షలు
  • హాజరుకానున్న 56,233 మంది అభ్యర్థులు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొ. అల్వాల రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వరుసగా రెండో ఏడాది ఈ పరీక్షను నిర్వహిస్తుండటం విశేషం. మే 13, 14 తేదీల్లో మూడు విడతల్లో జరగనున్న ఈ పరీక్షలకు ఈ ఏడాది మొత్తం 56,223 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మహిళలు 30,308 మంది, పురుషులు 25,915 మంది ఉన్నారు. మే 13 న మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 నుండి 12.30 గంటల వరకు, రెండవ సెషన్ 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు, మే 14 న మొదటి సెషన్ ఉదయం నిర్వహించనున్నారు. దివ్యాంగులు, ఉర్దూ విద్యార్థులకు మే 13 మధ్యాహ్నం రెండవ సెషన్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 16 రీజినల్ సెంటర్లలో, 69 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 100 మంది పరిశీలకులు పరీక్షా సరళిని పర్యవేక్షిస్తారు. పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకత పాటిస్తున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. మొదటి సెషన్ అభ్యర్థులను ఉదయం 8.30 నుండి, రెండో సెషన్ అభ్యర్థులను మధ్యాహ్నం 1 నుండి హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం సెషన్ అభ్యర్థులను 9.45 తర్వాత, మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులను 1. 45 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

Next Story