- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt.: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు!
మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించడంతో పాటు పాత అపార్ట్‌మెంట్లకు సైతం డ్యూటీ తగ్గింపు వెసులుబాటు కల్పించే ఆలోచన చేస్తున్నట్లు గృహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించడంతో పాటు పాత అపార్ట్ మెంట్లకు సైతం డ్యూటీ తగ్గింపు వెసులుబాటు కల్పించే ఆలోచన చేస్తున్నట్లు గృహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సాధారణ ప్రజలకు నష్టం కలగకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా స్టాంప్ విధానాన్ని భారతీయ స్టాంప్ చట్టం 1899ను అనుసరించి తెలంగాణ సవరణ బిల్లు-2025ను తీసుకురానున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. శనివారం సెక్రెటేరియట్‌లో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్.లోకేష్ కుమార్, న్యాయ వ్యవహారాల కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, సీఎం కార్యాలయ ఓఎస్డీ వేముల శ్రీనివాస్‌తో మంత్రి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021లో ప్రవేశ పెట్టిన సవరణ బిల్లును ఉపసంహరించుకొని ప్రస్తుత కాలానికనుగుణంగా 2025 సవరణ బిల్లు తీసుకు రావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలు సవరించాలని సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలన్నారు. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది.. అక్కడ హేతబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని ఆఫీసర్లకు ఆదేశించారు.
మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే యోచన
మహిళాభ్యుదయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందులో భాగంగా వారికి స్టాంప్ డ్యూటీ తగ్గించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా కొత్త, పాత అపార్ట్‌మెంట్‌లకు స్టాంప్ డ్యూటీ ఒకేలా ఉందని, పాత అపార్ట్‌మెంట్‌లకు రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణనలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. భారతీయ స్టాంప్ చట్టం 1899 ప్రకారం.. తెలంగాణ పరిధిలో నాలుగు సెక్షన్లను, 26 ఆర్టికల్స్‌ను సవరించేందుకు 2021లో శాసనసభలో సవరణ బిల్లును ఆమోదించి భారత ప్రభుత్వం ఆమోదం కోసం పంపించినట్టు ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ బిల్లుపై భారత ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినా 2023 జనవరిలో భారత ప్రభుత్వం ఈ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించిందని ఆఫీసర్లు తెలిపారు.






