TG Govt.: ఎల్ఆర్ఎస్ నిబంధనలు ఇక ఈజీ.. వాటర్ బాడీలో 200 మీటర్లు ప్రామాణికం

by Kema Shiva Kumar |

లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) స్కీం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు చేపట్టిన ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నది.

TG Govt.: ఎల్ఆర్ఎస్ నిబంధనలు ఇక ఈజీ.. వాటర్ బాడీలో 200 మీటర్లు ప్రామాణికం
X

దిశ, తెలంగాణ బ్యూరో: లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) స్కీం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు చేపట్టిన ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నది. ఈ మేరకు ఈ నెల 22న జారీ చేసిన జీవో 28లోని నిబంధనలను సరళీకృతం చేస్తూ సోమవారం మెమో జారీ చేసింది. సర్కారు చేసిన సవరణల్లో భాగంగా కోర్టు కేసులు, ఇరిగేషన్, రెవెన్యూ, డీటీసీపీ అభ్యంతరాలతో పాటు వివిధ రీజన్స్‌తో తిరస్కరణకు గురయ్యే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి సదరు దరఖాస్తుదారుడు ఇది వరకే చెల్లించిన తొలి విడత చార్జీల్లో 10 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా కట్ చేసుకుని, మిగిలిన చార్జీలను తిరిగి చెల్లించనున్నట్లు పురపాలక శాఖ పేర్కొంది. దీంతో పాటు చెరువులు, కుంటలు, సర్కారు భూములతో పాటు ఇతర వాటర్ బాడీల్లో, సంబంధిత సర్వే నంబర్లలో చేసిన లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్దీరణకు సరి కొత్త నిబంధనలు వెల్లడించింది. 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లతో పాటు అనధికార లే అవుట్లలో 10 శాతం ఇప్పటికే విక్రయించి ఉన్న లే అవుట్లను ఈ సరి కొత్త ఆదేశాలతో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సర్కారు స్పష్టం చేసింది.

200 మీటర్లే ప్రామాణికం

ప్రతి వాటర్ బాడీలో 200 మీటర్ల లోపు ఉన్న లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్దీరణకు సర్కారు సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలిసింది. వాటర్ బాడీలతో పాటు నిషేధిత సర్వే నంబర్లకు 200 మీటర్ల బయటనున్న లేఅవుట్లలోని ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం మలి దశగా చెల్లించాల్సిన ఫీజు ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతుందని, ఇందుకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్‌లకు స్పెషల్‌గా లింక్ పంపనున్నట్లు సర్కారు పేర్కొంది. నిషేధిత సర్వే నంబర్లు, చెరువులు, కుంటలు, వాటర్ బాడీలతో సంబంధం లేకుండా, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరం లేకుండా పరిష్కారానికి ఆమోద యోగ్యంగా ఉన్న దరఖాస్తులను సంబంధిత మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు వెరిఫికేషన్ చేసి ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు పంపిస్తారు. ఆ శాఖల నుంచి ఎలాంటి అభ్యంతరాల్లేకుంటే, దరఖాస్తులను ప్రాసెస్ చేసి ఆటోమెటిక్ గా చెల్లించాల్సిన మలి దశ చార్జీలను జనరేట్ చేస్తారు. ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 28 ప్రకారం చెల్లించాల్సిన సెకండ్ ఫీజ్‌ను వచ్చే మార్చి 31 కల్లా చెల్లించే దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీనిస్తూ ఫీజులు వసూలు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌కు అనుమతించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోనే ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

వాటర్ బాడీలకు సమీపంలో ఉన్న లే అవుట్లకు

వాటర్ బాడీలు, సర్కారు భూములకు 200 మీటర్ల లోపల ఉన్న సర్వే నంబర్లలోని ప్లాట్ల క్రమబద్దీకరణకు సంబంధించిన దరఖాస్తులన్నింటినీ డీటీసీపీ, రెవెన్యూ అధికారులు గుర్తించి, వాటిని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు పంపిస్తారు. ఆ తర్వాత దరఖాస్తులపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు డీటీసీపీ సహకారంతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి నివేదికలను పంపించాలని సర్కారు పేర్కొన్నది.

వాళ్లకే 25 శాతం రాయితీ

ఎవరైతే 31 మార్చి 2025 నాటికి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తారో వాళ్లకే 25 శాతం రాయితీ వర్తిస్తుందని పురపాలక, పట్టణాభి వృద్ధి శాఖ జారీ చేసిన మెమోలో పేర్కొన్నది. ఒక వేళ ఈ తేదీ నాటికి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించకపోతే వారికి రాయితీ వర్తించదని స్పష్టం చేసింది.

అన్ని విభాగాల్లోనూ..

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరిస్తున్న మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మెన్లు, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటీ కమిషనర్, డీటీసీపీ వంటి అన్ని విభాగాలకు ఈ మెమో వర్తిస్తుందని పురపాలక శాఖ స్పష్టం చేసింది. దీంతో పాటు ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న సర్వే నంబర్లను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది.

Next Story