TG Govt.: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అడ్వైజరీ జారీ చేసిన ఆరోగ్య శాఖ

by Kema Shiva Kumar |

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

TG Govt.: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అడ్వైజరీ జారీ చేసిన ఆరోగ్య శాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జూలై 6 నుంచి 9 తేదీల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి, ఆర్ద్రత పెరిగే అవకాశం ఉందని, నీరు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులకు దారితీయవచ్చని పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా నివారణ కోసం ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలని సూచించారు. రాత్రి వేళ ఇంటి తలుపులు, కిటికీలను మూసి వేయాలని.. దోమ కాటుకు గురికాకుండా దోమ తెరలను వాడాలన్నారు. పడకలు, శిశువుల పడకలను దోమ తెరలతో కప్పాలని పేర్కొన్నారు.

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ఇంటి చుట్టూ ఉంచుకోవాలని, సెప్టిక్ ట్యాంక్‌లను దోమలు పెరగకుండా మెష్‌తో కప్పాలని తెలిపారు. ప్రతి వారం శుక్రవారం డ్రై డే‌గా పాటించి, ఇంటి చుట్టూ నీటి నిల్వలను తొలగించాలని అధికారులు స్పష్టం చేశారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు ఫిల్టర్ చేసిన, కాచి వడబోసిన నీటిని తాగాలన్నారు. భోజనానికి ముందు ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, బయట ఆహారాన్ని తినడం మానెయ్యాని సూచించారు. గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణ (వైరల్ జ్వరాలు, ఇన్‌ఫ్లుఎంజా) జబ్బుపడిన వారితో లేదా మీరు జబ్బు పడినప్పుడు హ్యాండ్‌షేక్‌ను నివారించాలని తెలిపారు. ఇన్ఫెక్షన్ నివారించడానికి హ్యాండ్ శానిటైజర్‌‌ను తరచూ ఉపయోగించాలని చెప్పారు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు రుమాలును ఉపయోగించాలని.. జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, శరీర నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సేవలను సంప్రదించాలని అధికారులు అడ్వైజరీ జారీ చేశారు.

Next Story