- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Govt.: రైతు కూలీలకు సర్కార్ శుభవార్త.. 10 లక్షల మందికి ఆత్మీయ భరోసా!
భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ తో కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ తో కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించనుంది. ఈ స్కీమ్ ను జనవరి 26 నుంచి ప్రారంభించనుండగా.. ఏడాదికి రెండు విడతల్లో రూ. 12వేలు జమ చేయనున్నది. ఈ స్కీమ్ కు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. సుమారు పది లక్షల కుటుంబాలను ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. వ్యవసాయ భూమి లేకుండా, ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న వారు ఈ స్కీమ్ కు ఎలిజిబుల్ గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఉపాధి హామీలో సంవత్సరానికి కనీసం 20 రోజులు పని చేసి ఉండాలనే నిబంధన పెట్టింది. అందుకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నది. అర్హులను గుర్తించే బాధ్యతను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించింది.
10 లక్షల మంది లబ్ధిదారులు!
ఉపాధి హామీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 53.07 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1.10 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో 29 లక్షల మంది జాబ్ కార్డుదారులకు ఎలాంటి భూమి లేదని గుర్తించారు. ఇందులోనూ చాలా కుటుంబాలు ఏడాదిలో ఒక రోజు నుంచి పది రోజులు మాత్రమే పని చేసినట్లు గుర్తించారు. కనీసం 20 రోజులు పని చేసి ఉండాలనే నిబంధనను అమలు చేస్తామని ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 20 రోజులు ప్రామాణికంతో రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వీరికి ప్రతి పంట సీజన్ కు రూ. 6 వేలు చొప్పున ఇస్తే.. రూ. 600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది.
కూలీతో సమానంగా..
భూమి లేని నిరుపేదల కోసం 2005లో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ స్కీమ్ ను తీసుకువచ్చింది. కోట్లాది మంది ఉపాధికి భరోసా కల్పించింది. ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఆత్మీయా భరోసా స్కీమ్ ద్వారా ఏడాదికి రూ. 12 వేలు అందజేయనున్నది. ఈ పథకం వ్యవసాయ కూలీలు పొందే మొత్తం.. ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న పని దినాలతో సమానంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉపాధి హామీలో రోజుకు గరిష్టంగా రూ.230 వరకు చెల్లిస్తారు. అయితే కూలీలు సగటుగా రూ.200 పొందుతున్నారు. గరిష్ఠంగా 100 రోజులు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లెక్కన వారికి రూ. 20 వేలు వస్తాయి. ఇలా వంద రోజుల పనిచేసిన వారు గతేడాది 1.34 లక్షల జాబ్ కార్డుదారులు మాత్రమే ఉన్నారు. దీంతో వంద రోజులు పనికి వచ్చే వారు తక్కువనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సగటున వచ్చే కూలీ మొత్తాన్ని లెక్కిస్తే ప్రభుత్వం ఇచ్చే రూ.12 వేలకు కొంచెం అటూ ఇటుగానే ఉంటుందని అధికారులు లెక్కలు వేశారు.






