- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt.: ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీనే..! ఎన్నికలకు 27 మున్సిపాలిటీలు దూరం
హైదరాబాద్ మహా నగరం విస్తరణ, అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. భవిష్యత్ అవసరాలు, పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని భావిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహా నగరం విస్తరణ, అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. భవిష్యత్ అవసరాలు, పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని భావిస్తోంది. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని 27 మున్సిపాలిటీలను వీలినం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగానే రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు, మురుగునీటి, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టడానికి ఆయా శాఖలు ప్రణాళికలు రూపొందించాయి. దీంతోపాటు హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు(త్రిపుల్‌ఆర్) వరకు విస్తరించాలని సర్కార్ నిర్ణయించింది. వీటిన్నింటిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడంతో పాటు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీని ఒక్కటిగానే ఉంచాలా? మూడు భాగాలు విభజించాలా? అనే అంశాలపై అడ్మినిస్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ) అధ్యయనం చేస్తోంది. ఇంకా కొలిక్కి మాత్రం రాలేదని, చర్చల దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
27 మున్సిపాలిటీలకు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శివారు మున్సిపాలిటీల్లో 51 గ్రామాలను సైతం విలీనం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లోని పాలకవర్గాల గడువు గత నెల 26తో ముగిసిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి వార్డుల విభజన, కొత్తవార్డుల రూపకల్పన వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీల్లో మాత్రం ఎలాంటి ఎన్నికల కార్యక్రమాలు జరగడంలేదు. అందుకు కారణం జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడమేనని అధికారులు చెబుతున్నారు.
రూ.17,212 వేల కోట్లతో..
జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేయడానికే జలమండలి హైదరాబాద్ కోసం సమగ్ర మురుగునీటి మాస్టర్ ప్లాన్ ప్రకారం రూ.17,212.69 కోట్లతో రూపొందించింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో అనేక రోడ్డు ప్రాజెక్టులు చేపట్టనున్నారు. దీంతోపాటు తాగునీటి సరఫరా చేయడానికి ఇప్పటికే జలమండలి చర్యలు చేపట్టింది.
ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండీఏ..
హెచ్ఎండీఏ త్రిపుల్‌ఆర్ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ 14వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ఓఆర్ఆర్ వెలుపుల మరో 5 కిలోమీటర్ల మేరకు విస్తరించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఓఆర్ఆర్ పరిధి వరకే ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్జీసీఎల్)ను త్రిపుల్‌ఆర్ వరకు విస్తరించనుంది. దీంతో బహుళ జాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి అస్కారముందని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ, ఫార్మా, రక్షణ రంగ పరిశ్రమలు రానున్నాయని, అందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లోని పలు మండలాలు ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డితో కలిపి 8 జిల్లాలు ఉన్నాయి. త్రిపుల్‌ఆర్ వరకు విస్తరించడంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలు సైతం కలవనున్నాయి. దీంతోపాటు నాలుగు జోన్లుగా హెచ్ఎండీఏ పరిధిని ఆరు జోన్లుగా చేశారు. విస్తరణ తర్వాత జోన్లను పెంచుతారా? ఉన్న జోన్లలతోనే సరిపెట్టి కొత్తగా చేరే ప్రాంతాలను కలుపుతారా? అనేది చూడాల్సిందే.
కొలిక్కిరాని చర్చలు..
జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్డు వరక విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం మూడు ముక్కలు చేయాలా? నాలుగు ముక్కలు చేయాలా? రెండు ముక్కలు చేయాలా? యధతథంగా ఉంచాలా? చర్చలు జరుగుతున్నాయి తప్ప కొలిక్కి మాత్రం రాలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రా భౌగిళిక స్వరూపంపై అధ్యయనం చేసే బాధ్యతలను అడ్మినిస్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. విలీనం, విభజన అంశాల్లో రాజకీయ పార్టీల బలాబలాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాజకీయ కారణాలతోనే ఈ ప్రక్రియ ముందుకు పోవడంలేదనే చర్చ కూడా జరుగుతున్నది. ఈ ప్రశ్నలు, సందేహాలకు సమాధానం మాత్రం ప్రభుత్వం నిర్ణయంపైనే ఆదారపడి ఉంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.






