TG Govt.: ధరణి Vs భూభారతి.. ఆ రెండు చట్టాల మధ్య అంతులేని వ్యత్యాసం

by Kema Shiva Kumar |

ధరణి, భూభారతి చట్టాల మధ్య అంతులేని తేడా ఉన్నది.

TG Govt.: ధరణి Vs భూభారతి.. ఆ రెండు చట్టాల మధ్య అంతులేని వ్యత్యాసం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి, భూభారతి చట్టాల మధ్య అంతులేని తేడా ఉన్నది. ఆర్వోఆర్-2020 అమలులోకి వచ్చాక చట్టం గురించి మాత్రమే చర్చ జరిగింది. అమలుకు సంబంధించిన విధి విధానాలు బయటికి రాలేదు. ఎక్కడా డిస్కషన్ జరగలేదు. కానీ ప్రస్తుతం భూభారతి అమలులోకి వచ్చాక జోరుగా చర్చ సాగుతున్నది. గత, ప్రస్తుత చట్టాల మధ్య తేడా సుస్పష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

అధికార వికేంద్రీకరణ చేయలేదా?

భూ భారతిలో అధికార వికేంద్రీకరణ జరగలేదని కొందరు విమర్శిస్తున్నారు. తహసీల్దార్లకు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, విరాసత్ అధికారాలు మాత్రమే ఉన్నాయని, కొత్తగా ఏమీ ఇవ్వలేదని వాదిస్తున్నారు. అయితే ఆర్వోఆర్-2025లో తహసీల్దార్ల బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతి అంశానికి, దరఖాస్తుకు రికార్డింగ్ అథారిటీ తహసీల్దారే అయినప్పుడు.. పరిష్కరించే అధికారం వారికే కట్టబెట్టేటట్లుగా చట్టంలో వెసులుబాటు ఉండదంటున్నారు. కింది స్థాయి అధికారి రికార్డ్ చేస్తే.. ఆపై అధికారి పరిష్కరించే వీలుంటుందని క్లారిటీ ఇస్తున్నారు. మండల స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించే తహసీల్దార్లకు ఆర్వోఆర్-1971 ప్రకారం ఉన్న అన్ని అధికారాలు ఇప్పుడూ ఉన్నాయంటున్నారు. దేశంలోని ఏ ఆర్వోఆర్ చట్టంలోనూ రికార్డింగ్ అథారిటీ, పరిష్కరించే అధికారం ఒకే అధికారికి లేవని ఉన్నతాధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఫైలు మండల కార్యాలయం నుంచి సర్క్యులేట్ కావాలి. మ్యుటేషన్ లో విచారణ బాధ్యత అదనంగా వచ్చింది. దీనికి ఫీల్డ్ విజిట్ తప్పనిసరి అవుతుంది. అలాగే సగటున రోజుకు 30 రిజిస్ట్రేషన్ల, మ్యుటేషన్ల భారం కూడా ఉంది. దానికి తోడు ఆర్వోఆర్ మినహా మిగతా చట్టాల ద్వారా సంక్రమించిన అన్ని అధికారాలు తహసీల్దార్లకు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఓల్డ్ మ్యుటేషన్ల అధికారం మాత్రం ఆర్డీవోలకు కట్టబెట్టినట్లు రూల్స్ లో పేర్కొన్నారు.

బేస్ రికార్డు కోసమే..

భూ భారతి రూల్ 4 (1) ప్రకారం భూ భారతి పోర్టల్ లో మీ భూమి వివరాలు ఏమైనా తప్పుగా నమోదైతే చట్టం అమలులోకి వచ్చిన తేదీ అంటే 2025 ఏప్రిల్ 14 నుంచి ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇది నిబంధన. నిజానికి మరికొంత టైం కూడా ఇస్తామని అధికారులు అంటున్నారు. కానీ ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత ఇన్నేండ్లకు కూడా రికార్డుల్లోని తప్పులను రైతులు, పట్టాదారులు గుర్తించకపోతే కష్టం. ఏదో ఒక నాటికి బేస్ రికార్డు తయారు చేసుకోవాలి. అంటే పూర్తి చేసిన బేస్ రికార్డును సేత్వార్ లేదా ఖాస్రాగా వినియోగించుకునే వీలుంటుంది. ఇప్పటికీ 75 ఏండ్ల నాటి రికార్డును బేస్ రికార్డుగా పరిగణించడం వల్ల ఎన్ని లక్షల మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారో దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తుంది. అందుకే ఈ సెక్షన్ ని పెట్టినట్లు భూ భారతి చట్టం రూపకర్త భూమి సునీల్ కుమార్ స్పష్టత ఇచ్చారు. ప్రతి రైతు తన రికార్డును ఇప్పటికైనా చెక్ చేసుకోవాల్సిందే. తప్పొప్పులను సవరించుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. రికార్డును 100 శాతం ప్యూరిఫై చేసుకుంటే.. మిగతా పనులను మొదలుపెట్టొచ్చు.

ఇంటి స్థలాలకు హక్కుల రికార్డు

కేంద్ర ప్రభుత్వం నాలుగేండ్ల క్రితం గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీలను సర్వే చేసి ఇంటి స్థలాలకు ఆస్తి కార్డులు ఇవ్వాలన్న లక్ష్యంతో స్వమిత్వ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో డ్రోన్ సర్వే చేసి ఆస్తి కార్డులను జారీ చేస్తున్నారు. తెలంగాణలో అలాంటి హక్కుల రికార్డు లేదు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అమలు చేయలేదు. అందుకే ఆబాదీ, వ్యవసాయేతర భూములకు ప్రత్యేక రికార్డు రూపొందించడానికి ఆర్వోఆర్-2025లో సెక్షన్ 4(2), రూల్-3ను అమలు చేయనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఈ సెక్షన్ అమల్లోకి వస్తుంది. దీని ద్వారా ఆస్తి విలువ పెరుగుతుంది. ఆ ఆస్తి కార్డుతో బ్యాంకులోనూ రుణం పొందొచ్చు. నిరర్ధక ఆస్తిగా ఉంటున్న దాని నుంచి ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. ధరణి పోర్టల్ లో కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే అమలైంది.

గ్రామ రెవెన్యూ రికార్డులు

గ్రామ పహానీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్లను ప్రభుత్వం నిర్వహిస్తుంది. భూమి హక్కుల రికార్డుల్లోని వివరాలను ఈ రికార్డులో ఆన్ లైన్ ద్వారా పొందుపరుస్తారు. మ్యుటేషన్ చేసిన ప్రతిసారి ఆన్ లైన్ లో గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతాయి. ప్రతి సంవత్సరం డిసెంబరు 31వ తేదీన గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రం చేస్తారు. దీని కోసం సెక్షన్ 13, రూల్ 12ని తీసుకొచ్చారు. దీని వల్ల భూముల లెక్కల్లో తేడాలు రావు. విస్తీర్ణం పెరిగేందుకు చాన్స్ ఉండదు. పైగా ప్రతి సంవత్సరం రికార్డును ప్రింట్ తీసి భద్రం చేయడం ద్వారా ఆన్ లైన్ లో డేటా అదృశ్యమైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధరణి అమలైన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ నిలిచిపోయింది. గత ఆర్వోఆర్ చట్టంలో ఈ రికార్డుల ప్రస్తావనే అవసరం లేదన్నట్లుగా భావించారు. కానీ ఆన్ లైన్ డేటాను మాత్రమే విశ్వసించడం ద్వారా ఏదైనా జరగరాని ఉత్పన్నమో, సైబర్ అటాక్ జరిగినప్పుడు ఈ రికార్డు ఉపయోగపడుతుంది. పైగా రైతులు ఆన్ లైన్ లో రికార్డు చూసుకోవడానికి ఇబ్బంది పడొచ్చు. అలాంటప్పుడు జీపీవోల దగ్గరికి వెళ్లి ఫిజికల్ కాపీలో వివరాలను చెక్ చేసుకోవచ్చు.

పారదర్శకంగా భూ హక్కుల రికార్డు

భూ భారతిలో భూమి హక్కుల రికార్డులు అందరికీ అందుబాటులో ఉంటాయి. ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునే రైట్ టూ ప్రైవసీ ఆప్షన్ ని అమలు చేశారు. భూ భారతిలో హక్కుల రికార్డు పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా సర్టిఫైడ్ కాపీలు కావాలంటే భూ భారతిలోని ఫారంలో రూ.10 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. తహశీల్దార్ సర్టిఫైడ్ కాపీలు జారీ చేస్తారు. దీనికి గాను సెక్షన్ 12, రూల్ 11 ని చూపించారు.

త్వరలోనే క్యాడస్ట్రల్ మ్యాప్స్

ధరణి పోర్టల్ లో కొన్ని గ్రామాల క్యాడస్ట్రల్ మ్యాప్స్ ఉండేవి. వివాదాలు అధికంగా ఉన్న గ్రామాలు, హైదరాబాద్ చుట్టూ ఉండే చాలా గ్రామాల మ్యాప్స్ కనిపించకుండా చేశారు. అయితే త్వరలోనే భూ భారతి పోర్టల్ లో అన్ని మ్యాప్స్ లను అప్ లోడ్ చేయనున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు తెలిపారు.

త్వరలోనే భూ మిత్ర

భూ భారతి చట్టం, అప్లికేషన్లు, దరఖాస్తు విధానం వంటి అనేకాంశాలపై ఎలాంటి సందేహాలు తలెత్తినా నివృత్తి చేసేందుకు ‘భూ మిత్ర లేదా భూ రక్షక్’ వంటి చాట్ బోట్ ని డిజైన్ చేశారు. అయితే ప్రస్తుతానికి అది పని చేయడం లేదు. త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్న మెస్సేజ్ చూపిస్తున్నది. దీన్ని మూడు, నాలుగు దశల్లో అమలు చేయడానికి సీసీఎల్ఏ సీఎమ్మార్వో పీడీ మంద మకరంద్ నేతృత్వంలోని టీమ్ పని చేస్తున్నది. ఇప్పటికే చాలా ఎఫ్ఏక్యూ (ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్)ని రూపొందించారు. ఇంకా అనేక రూపాల్లో ప్రశ్నలను సిద్ధం చేస్తున్నారు. రెండు వారాల్లో మొదలయ్యే చాన్స్ కనిపిస్తున్నది. కొత్త చట్టంపైన ఎలాంటి సందేహాలు వచ్చినా ఎవరినీ అడిగే పని లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఈ చాట్ బోట్ పని చేసేలా డిజైన్ చేశారు. రానున్న రోజుల్లో ఇంకెలాంటి డౌట్స్ వస్తాయో పరిశీలించి వాటిని కూడా భూ మిత్రకు అనుసంధానం చేస్తారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాల్లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ అధ్యయనం ద్వారా మరికొన్ని మెరుగులు దిద్దడానికి కృషి చేస్తున్నారు.

చర్చించే స్వేచ్ఛ

గత ప్రభుత్వ హయాంలో ఏ అంశం మీదైనా విమర్శిస్తే ఎక్కడి నుంచి ఎలాంటి విపత్తు మీద పడుతుందోనన్న ఆందోళన ఉండేది. ఇప్పుడు అలాంటి వాతావరణం నుంచి స్వేచ్ఛగా ఎవరైనా వారి అభిప్రాయాలను వెల్లడించే వీలుంది. ఆర్వోఆర్-2025 రూపకల్పన సమయంలోనూ వేలాది మంది చట్టం ఎలా ఉంటే బాగుంటుందో అభిప్రాయాలను వెల్లడించారు. ఎంతో మంది, ఎన్నో సంస్థల ద్వారా చర్చలు పెట్టారు. ప్రస్తుతం భూ భారతి రూల్స్ మీద కూడా జోరుగా చర్చ జరుగుతున్నది. ఇలాంటి వాతావరణం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమని కొందరు రెవెన్యూ అధికారులు అంటున్నారు. తాము కూడా ధరణి అమలైనప్పుడు ఏదైనా చెప్పడానికి ఉన్నతాధికారులు టైం ఇచ్చే వారు కాదని, కనీసం తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదంటున్నారు. అప్పీల్ వ్యవస్థ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ఎన్నో సార్లు సూచించినా అప్పటి ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదంటున్నారు. ఇప్పుడైనా ఐఏఎస్ అధికారులతో పాటు మంత్రి, సీఎం వరకు వెళ్లి ఎలా ఉంటే బాగుంటుందో చెప్పే వెసులుబాటు కలిగిందంటున్నారు. అటు అధికారులతో పాటు ఇటు రిటైర్డ్ అధికారులు, అడ్వకేట్లు, రైతు సంఘాలు, రైతులు భూ భారతి రూల్స్ పైనా చర్చించుకునేందుకు అవకాశం లభించింది. ఇప్పటికీ ఆర్వోఆర్-2020 రూల్స్ కాపీ ఎక్కడా దొరకదు. కానీ భూ భారతి రూల్స్ ప్రతులు మాత్రం ప్రతి ఊరి గ్రూపులోనూ సర్క్యులేట్ అవుతుండడం గమనార్హం.

Next Story