- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Govt.: లబ్ధిదారులకు బిగ్ అలర్ట్..! అలా చేస్తేనే కొత్త రేషన్ కార్డు
రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారంతా ముందుగా పాత రేషన్ కార్డులో పేరు తొలగించి మీసేవ కేంద్రాల ద్వారా కొత్త వాటికి దరఖాస్తు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారంతా ముందుగా పాత రేషన్ కార్డులో పేరు తొలగించి మీసేవ కేంద్రాల ద్వారా కొత్త వాటికి దరఖాస్తు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభలు, మీసేవ కేంద్రాల నుంచి కొత్త దరఖాస్తులు 13 లక్షల వరకు స్వీకరించింది. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్ మార్పునకు సంబంధించినవి 24 లక్షల వరకు వచ్చాయి. వీటిలో చాలామంది పాత కార్డులో పేర్లు తొలగించకుండా దరఖాస్తు చేశారు. దీంతో కార్డుల మంజూరు అధికారులకు తలనొప్పిగా మారింది. చాలా మంది పేద లు స్థానిక రాజకీయ నాయకులతో సిఫారస్ చేయిస్తుండటంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం సవాల్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా ఆహార భద్రత కల్పించేందుకు ఆధార్ తో రేషన్ కార్డులను అనుసంధానం చేసింది. ఎక్కడైనా ఒక ఆధార్ నంబర్ కార్డుకు అనుసంధానమై ఉంటే మరో కార్డుకు దరఖాస్తు చేసే వీలుండదు. కొత్తగా వివాహం చేసుకున్న మహిళ లు, అడ్రస్ మార్పు వంటి విషయం గమనించడం లేదు. చాలా మందికి తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో పేర్లు ఉంటాయి. మెట్టినింటికి వచ్చిన అనంతరం నూతన కార్డు కోసం దరఖాస్తులు చేసినప్పుడు అవి తిరస్కరణకు గురవుతున్నాయి. వీరు పాత కార్డులోని తమ వివరాలను తొలగించాల్సిన అవసరం ఉంది.
ఎలా తొలగించాలి..?
వివాహం జరిగిన మహిళలు పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో తమ పేరు తొలగించుకోవాలంటే తెల్ల కాగితంపై స్థానిక తహసీల్దారుకు అభ్యర్థన పెట్టాలి. అత్తారింట్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకుంటున్నామని, పేరు తొలగించాలని దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. వివాహం జరిగిన ధ్రువీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికను జత చేయాలి. ఒకటి, రెండు రోజుల్లో పేర్లను తొలగిస్తారు. అనంతరం కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సన్నబియ్యం నిల్వలు సరిపడా లేక..
ప్రభుత్వం ఈఏడాది జనవరి నుంచి రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు సన్నబియ్యం ఊసే లేదు. ప్రజలు ఎప్పడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కొత్తకార్డులు మంజూరు చేస్తే రాష్ట్రంలో కార్డుల సంఖ్య కోటి దాటుంది. దీంతో నెలకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుంది. అధికారుల గణాంకాల ప్రకారం సన్నబియ్యం నిల్వలు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉ న్నాయి. అవి నాలుగు నెలలకు సరిపోతాయి. మిగతా నెలల ఏవిధంగా ఇవ్వాలని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరో రెండు నెలలు గడిస్తే యాసంగి సీజన్ కు చెందిన సన్నాలు సేకరించి సీఎంఆర్ చేస్తే కనీసం 8నెలల వరకు సరిపోతుందని అంచనా వేస్తూ కార్డుల మంజూ రు అందుకే ఆలస్యమవుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్పారు.
రేషన్ కార్డులు లేక పేదల అవస్ధలు
ప్రభుత్వం ఏం పథకం అమలు చేసినా రేషన్కార్డు జత చేయాల్సి వస్తోంది. ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్సిలిండర్ వంటి పథకాలకు అర్హులుగా పొందాలంటే రేషన్కార్డు తప్పని సరిగా మారింది. రేషన్కార్డులో పేర్లు ఉన్నా కొన్ని కుటుంబాల్లో పెళ్లయిన తరువాత వేరుగా ఉంటున్న కుమారుల కుటుంబాలకు ఈ పథకాలు వర్తించడం లేదు. ఏటీఎం కార్డుల మాదిరిగా ప్రత్యేక చిప్ ఉండేలా రేషన్కార్డులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నాలుగునెలల క్రితం కర్నాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు అధికారులు వెళ్లి అక్కడ రేషన్ పంపిణీ, కార్డుల విధానంపై అధ్యయనం చేసి వాటి తరహాలోనే ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 1న లక్ష కొత్త కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. ఈనెలాఖరులోగా ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.






