- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Govt.: ‘సాదాబైనామా’కు త్వరలో పరిష్కారం.. అందుబాటులోకి రానున్న కొత్త ప్రక్రియ
సాదాబైనామాలకు సొల్యూషన్ చూపేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: సాదాబైనామాలకు సొల్యూషన్ చూపేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీని కోసం భూభారతిలో ప్రత్యేక మాడ్యూల్‌ను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలిసింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం బీఆర్ఎస్ హయాంలో స్వీకరించిన 9 లక్షల అప్లికేషన్లు ఐదేండ్లుగా పెండింగులో ఉన్నాయి. అప్పటి చట్టంలో అనువైన సెక్షన్లు లేకపోవడంతో రెగ్యులరైజేషన్‌పై కోర్టు స్టే విధించింది. అయితే ఆర్వోఆర్-2025లో పెండింగ్ అప్లికేషన్ల మేరకు రెగ్యులరైజ్ చేసేందుకు వీలుగా చట్టాన్ని రూపొందించారు. ఈ మేరకు రూల్స్‌ను కూడా రూపొందించారు. అయితే కోర్టు స్టే కొనసాగుతుండడంతో ఆ అప్లికేషన్లను పరిశీలించడం లేదు. కానీ త్వరలోనే వీటికి మోక్షం లభించనున్నది. ఈ దరఖాస్తుల పరిశీలనకు అవసరమైన మాడ్యూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చే కసరత్తు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నది. త్వరలోనే సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన, ఫీల్డ్ విజిట్, పంచనామా, సాక్ష్యుల విచారణ, కాన్సెంట్ వంటి అనేకాంశాలను అప్ లోడ్ చేసేందుకు వీలుగా భూ భారతిలో కొత్త మాడ్యూల్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన వెబ్ డిజైన్ పూర్తి కావొచ్చిందని వెల్లడించారు.
రెండు, మూడు దశల్లో అప్పీల్!
భూభారతిలో అప్పీల్ వ్యవస్థను తీసుకురాగా, అందులోనూ మరిన్ని సదుపాయాలను కల్పించేలా సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్ట్ డైరెక్టర్ మందా మకరంద్, ఆయన టీమ్ కృషి చేస్తున్నది. త్వరలోనే మరిన్ని అప్పీల్ మాడ్యూల్స్ పెరగనున్నాయి. ఈ సదుపాయం వల్ల తహశీల్దార్ న్యాయం చేయకపోతే ఆర్డీవో, ఆర్డీవో కూడా పట్టించుకోకపోతే అదనపు కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. రెండు దశల్లోనూ అధికారుల దగ్గర న్యాయం దక్కలేదని భావిస్తే ట్రిబ్యునల్ ను ఆశ్రయించొచ్చు. ఐతే ప్రస్తుతానికి ట్రిబ్యునల్స్ వ్యవస్థ ఏర్పడలేదు. ఆ వ్యవస్థ అందుబాటులోకి వస్తే సామాన్యుడు మూడు దశల్లో న్యాయం కోసం ఆశ్రయించే వెసులుబాటు లభిస్తుంది. అందుకే ప్రస్తుతం రెండు దశల్లో అప్పీల్ చేసేందుకు అనువుగా భూ భారతి పోర్టల్ లో అప్పీల్ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. అలాగే మరికొన్ని మాడ్యూల్స్ ను కూడా మెరుగుపరిచే పనిలో ఉన్నారు. అప్పీల్ మాడ్యూల్స్ పెరనున్నట్లు తెలిసింది.
సక్సెషన్‌లోనూ మార్పులు
తండ్రి లేదా తల్లి నుంచి వారసులకు భూమి బదలాయించడంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అత్యంత క్లిష్టంగా ఉన్న ఈ పరిష్కారం.. ఇప్పుడు ఈజీగా అయ్యేలా భూభారతిని సిద్ధం చేస్తున్నారు. సక్సెషన్/విరాసత్ చేసుకునేందుకు డేటా ఎంట్రీ, పేమెంట్, ఈ చలాన్, ట్రాన్సాక్షన్ సమ్మరీ, స్లాట్ బుకింగ్ వంటివి పూర్తయిన తర్వాత అధికారులకు అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది. ఇందులో సక్సెసర్, ప్రాపర్టీ డిటెయిల్స్, డెత్ సర్టిఫికెట్, జాయింట్ అగ్రిమెంట్ వంటివి అప్ లోడ్ చేస్తున్నారు. విరాసత్ రిజిస్టర్డ్ విల్, అన్ రిజిస్టర్డ్ విల్, వితౌట్ విల్.. మూడు రకాలుగా చేస్తున్నారు. ఐతే సక్సెషన్ చేయడంలో విచారణ, పంచనామా వంటి అనేకం ఉన్నాయి. ఇవన్నీ అప్ లోడ్ చేయడానికి అవసరమైన వ్యవస్థను తీసుకురానున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాడ్యూల్స్ నుంచి మెరుగైన సేవలు అందించేందుకు సీసీఎల్ఏ వర్గాలు కృషి చేస్తున్నాయి. త్వరలోనే సక్సెషన్ మాడ్యూల్ లో మార్పులు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మ్యాప్ స్లో..
ధరణి పోర్టల్ లో ఎన్ని గ్రామాల క్యాడస్ట్రల్ మ్యాప్స్ అందుబాటులో ఉండేవో అన్నీ భూ భారతిలోనూ వీక్షించొచ్చు. ఏయే సర్వే నంబరులో ఎంత విస్తీర్ణం ఉంది? దాని సరిహద్దు సర్వే నంబర్లు ఏమిటి? ఎన్ని సబ్ డివిజన్లు ఉన్నాయి? ఇలాంటి అన్ని వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐతే ఈ మ్యాప్ తో ప్రతి ఒక్కరికి అవసరం లేదు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, ఏదైన సర్వే నంబరు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే అవసరం. అందుకే ప్రొఫైల్ ద్వారా క్యాడస్ట్రల్ మ్యాప్స్ చూసే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం భూభారతి పోర్టల్ పై లోడ్ పెరగడం వల్ల క్యాడస్ట్రల్ మ్యాప్స్ సరిగ్గా ఓపెన్ కావడం లేదని తెలిసింది.
త్వరలోనే ఫీడ్ బ్యాక్ ఆప్షన్
భూ భారతిలో త్వరలో ఫీడ్ బ్యాక్ ఆప్షన్ ను తీసుకురానున్నారు. సేల్ డీడ్, సక్సెషన్, ఇతర అన్నింటికీ పట్టాదారుడికి ఫీడ్ బ్యాక్ లింక్ ను పంపిస్తారు. దాన్ని నింపి తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఏమైనా అసౌకర్యం కలిగిస్తే ఫిర్యాదు చేసేందుకు ఆప్షన్ ఉంటుంది. తహశీల్దార్, ఆర్డీవో, ఇతర అన్ని స్థాయిలో చోటు చేసుకున్న ఇబ్బందులను ఫీడ్ బ్యాక్ ద్వారా తెలపొచ్చు. అది నేరుగా పోర్టల్ ద్వారా ఉన్నతాధికారులకు చేరుతుంది. దాంతో ఎవరైనా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయం కూడా ఉన్నతాధికారులకు తెలుస్తుంది. అలా ఏ జిల్లా? ఏ మండలం? లో ఎక్కువగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందో దాన్ని బట్టి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. అలాగే మొబైల్ యాప్ డిజైన్ పూర్తయ్యింది. ఇందులో భూమిని ఎవరైనా సవరించినా, నిషేధిత జాబితాలో నమోదు చేసినా, వేరేవరైనా విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసినా వెంటనే పట్టాదారుకు తెలిసేలా అలర్ట్ మెసెజ్ వెళ్లేట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రతి ఖాతాదారుడి ఫోన్ నంబరును అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత సాధ్యమవుతుంది. త్వరలోనే ఇలాంటి సరికొత్త మార్గాన్ని అమలు చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు నివేదించారు.






