టీజీ జెన్‌కో బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. కానీ గడువు గందరగోళం

by Naga Rani Yarlagadda |

తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

టీజీ జెన్‌కో బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. కానీ గడువు గందరగోళం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వ పరంగా బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించడంతో 2025-2026 సంవత్సరానికి గాను రాష్ట్ర, జోనల్ క్యాడర్ ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు టీజీ జెన్‌కో శ్రీకారం చుట్టింది. ఇంజినీరింగ్, అకౌంట్స్ సర్వీసెస్‌కు చెందిన ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను యాజమాన్యం విడుదల చేసింది. ఈ బదిలీల ప్రక్రియ 2025 డిసెంబర్ 23 నుంచి 2026 జనవరి 31 వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కార్పొరేట్ ఆఫీస్‌లో పదేళ్లు దాటితే బదిలీ తప్పదు..

2025 మార్చి 31 నాటికి కార్పొరేట్ కార్యాలయంలో కనీసం 10 ఏళ్ల సేవ పూర్తి చేసిన ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదే సమయంలో పవర్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ కోరుకునే ఉద్యోగులు కనీసం 15 ఏళ్ల సేవ పూర్తి చేసి ఉండాలని నిబంధనగా పేర్కొంది. గతంలో బదిలీ పొందిన ఉద్యోగులు కనీసం నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసిన తర్వాతే మరోసారి బదిలీకి అర్హులవుతారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు జీహెచ్‌ఎంసీ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో డెప్యుటేషన్‌పై పనిచేసిన కాలాన్ని 'స్టేషన్ సర్వీస్'గా పరిగణిస్తారు. కానీ, హైదరాబాద్ పరిధిలోని ఇతర సంస్థల్లో డెప్యుటేషన్‌పై పనిచేసి ఉంటే మాత్రం అది కార్పొరేట్ ఆఫీస్ సర్వీస్ కిందకే వస్తుంది. ఇక ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం, కంప్యూటర్స్ విభాగాలను కలిపి ఒకే స్ట్రీమ్‌గా, సివిల్ విభాగాన్ని ప్రత్యేక స్ట్రీమ్‌గా పరిగణించి బదిలీలు చేపట్టనున్నారు.

ఖాళీల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యతలు..

బదిలీల కేటాయింపులో మొత్తం ఖాళీల్లో 25 శాతం వైద్య కారణాలపై, మరో 25 శాతం భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న స్పౌజ్ కేసులకు, మిగిలిన 50 శాతం వ్యక్తిగత కారణాల ఆధారంగా కేటాయిస్తామని యాజమాన్యం వెల్లడించింది. అయితే శాఖాపరమైన విచారణలు, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేసింది. వ్యక్తిగత, వైద్య, భార్యాభర్తల ఉద్యోగ సంబంధిత దరఖాస్తులను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో 2026-2027 సంవత్సరంలో ఎలాంటి సాధారణ బదిలీలు ఉండవని టీజీ జెన్‌కో యాజమాన్యం స్పష్టం చేయడం గమనార్హం. దీని వల్ల ఈసారి జరిగే బదిలీలే వచ్చే ఏడాదికి కీలకంగా మారనున్నాయి.

పాత తేదీలతో ఉత్తర్వులు.. కొత్త చిక్కులు

బదిలీల ప్రక్రియ 2025 డిసెంబర్ 23 నుంచి 2026 జనవరి 31 వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, మార్గదర్శకాలు మాత్రం జనవరి 19న విడుదలయ్యాయి. అంటే దాదాపు నెల రోజులు గడిచిపోయాక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో జనవరి 31 లోపు ప్రక్రియ పూర్తి చేయాలంటే అధికారుల చేతిలో కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. సాధారణంగా బదిలీల ప్రక్రియలో అభ్యంతరాల స్వీకరణ, సీనియారిటీ జాబితాల పరిశీలన, ఆప్షన్ల ఎంపికకు తగిన సమయం అవసరం. ఇప్పుడు గడువు తక్కువగా ఉండటంతో ప్రక్రియను మమ అనిపించే ప్రమాదం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత తక్కువ సమయంలో దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యమేనా? హడావుడిగా ప్రక్రియ ముగించడం వల్ల అర్హులైన వారికి అన్యాయం జరిగే ఆస్కారం లేదా? కొందరికి లబ్ధి చేకూర్చేందుకే ఇలా సమయం లేకుండా చేశారా? అనే అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.

Next Story