- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG DSC: నిరుద్యోగులకు శుభవార్త.. 6 వేల పోస్టులతో డీఎస్సీ?
త్వరలోనే మరో డీఎస్సీ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే మరో డీఎస్సీ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు) పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గతేడాది టెట్ నిర్వహించి వెంటనే డీఎస్సీని ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు మెగా డీఎస్సీ వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా 5 వేల పోస్టులను కలిపి 11 వేలకు పైగా పోస్టులకు రేవంత్ సర్కార్ డీఎస్సీ పరీక్షలను నిర్వహించింది. కాగా, అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డీఎస్సీని వేస్తామని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారు. దీంతో త్వరలోనే డీఎస్సీ ఉంటుందని భావించి, అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు.
రేషనలైజేషన్ చేపడితే తగ్గే అవకాశం?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలో ఉన్న ఖాళీలకు వీటిని జోడిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని కలిపితే సంఖ్య 6 వేలు దాటే చాన్స్ ఉంది. అదే నిజమైతే డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు సైతం ఎంతో పట్టుదలతో సన్నద్ధం అవుతున్నారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం విడుదల చేయనున్న డీఎస్సీపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈసారి టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారా? లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదిక వచ్చాకే ఎస్సీ కోటా ఎంతమేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్టు ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
ఏడాదిలోనే 2 సార్లు టెట్..
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే రెండు సార్లు టెట్ నిర్వహణతో పాటు, ఒక డీఎస్సీని నిర్వహించింది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి టెట్‌ను నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖలో అసలు ఖాళీలు ఉండకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా ప్రణాళికలను రచిస్తున్నారు. విద్యాశాఖ సీఎం దగ్గర ఉండటంతో ఏ పొరపాటు జరిగినా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే చాన్స్ ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నారు. గతంలో చిన్న చిన్న తప్పుల వల్ల విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విద్యా సంవత్సరం అలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ముగిసిన టెట్
ఈనెల 2వ తేదీ నుంచి 20 వరకు టెట్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. సోమవారంతో టెట్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రతిరోజూ కంప్యూటర్ బేస్డ్ విధానంలో రెండు సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌కు మొత్తం 2,75,753 అప్లికేషన్లు వచ్చాయి. పేపర్-1కు 94,327, పేపర్-2కు 1,81,426 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలోని 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు. పరీక్షలకు హాజరైన వారి సంఖ్య 2,05,278 ఉండగా.. హాజరు కానీ వారి సంఖ్య 70,475గా ఉంది. టెట్ ఎగ్జామ్స్‌లో మొత్తంగా 74.44 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా పేపర్-2లో సోషల్ సైన్స్ పరీక్షలకు 75.33శాతం హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యల్పంగా పేపర్-1కు 73.65 శాతం హాజరు నమోదైంది.ప్రాథమిక కీ ఈనెల 24న విడుదల చేయనున్నారు.అభ్యర్థులు https://schooledu.telangana.gov.in లింక్ ద్వారా ఈ నెల24 నుంచి 27 వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలను తెలపాలని అధికారులు వెల్లడించారు.






