- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG CMO: సీఎంఓలో ప్రక్షాళన..! అధికారుల పనితీరుపై విమర్శలు
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసులో భారీ ప్రక్షాళన ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసులో భారీ ప్రక్షాళన ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్నది. అక్కడ పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లను తప్పించడమో లేక ప్రస్తుతమున్న శాఖల బాధ్యతలు మార్చడమో? చేస్తారనే చర్చ సచివాలయం వర్గాల్లో నడుస్తున్నది. అధికారుల పనితీరు సరిగా లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. కొందరికి సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ తెలియక కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శలు తలెత్తుతున్నాయి.
సమన్వయ లోపంతో కొత్త వివాదాలు..
సీఎం కార్యాలయంలో పనిచేసే సెక్రెటరీలు అటు సీఎం, ఇటు డిపార్ట్‌మెంట్స్‌కు మధ్య సంధాన కర్తలుగా ఉండాలి. సీఎం అడిగిన సమాచారాన్ని ఆయా శాఖల బాధ్యతలు చూస్తున్న సెక్రెటరీల నుంచి తెప్పించుకోవాలి. డిపార్ట్‌మెంట్ సెక్రెటరీలకు విధానపరమైన నిర్ణయాలను అమలుచేసే టైంలో ఏమైనా అనుమానాలు ఉంటే సీఎం దగ్గర సమాచారం తీసుకుని నివృత్తి చేయాలి. కానీ, ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న సెక్రెటరీలు, శాఖలు చూస్తున్న సెక్రెటరీల మధ్య సమన్వయం కొరవడిందని డిస్కషన్ జరుగుతున్నది. దీంతో ఫీల్డ్‌లో ఇబ్బందులు రావడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన సందర్భాలున్నాయి. దీనికి ప్రధాన కారణం అడ్మినిస్ట్రేషన్‌లో పెద్దగా అనుభవం లేని ఆఫీసర్లను సెక్రెటరీలుగా నియమించడమే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. సెక్రెటరీలు తమ అనుభవలేమితో కొన్నిసార్లు ఒకశాఖకు చెందిన ఫైల్‌ను మరో శాఖ అధికారులకు పంపుతున్నట్లు విమర్శలొస్తున్నాయి.
సమస్య పరిష్కరించకుండా కొర్రీలా?
సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి మినహా మిగతా అధికారులకు సచివాలయంలో పనిచేసిన అనుభవం లేదని తెలిసింది. దీంతో సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ తెలియక డిపార్ట్‌మెంట్ సెక్రెటరీలతో పేచీలు పెట్టుకుంటున్నట్టు ప్రచారం ఉన్నది. ప్రభుత్వంలో ఏదైనా ఫైల్‌పై సీఎం రేవంత్‌దే తుదినిర్ణయం. ఆయన వద్దకు వచ్చిన ఫైల్‌ను ఆమోదించడం లేక తిరస్కరించడం, కుదరకపోతే పెండింగ్‌లో ఉంచడం ముఖ్యమంత్రి ఇష్టం. కానీ, సీఎం ఆమోదానికి పంపే ఫైల్స్‌ను సెక్రెటరీలు పలు కొర్రీలు పెడుతూ వెనక్కి పంపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.‘సీఎం వద్దకు వచ్చే ఫైల్స్‌కు పరిష్కారం చూపాలి. త్వరగా నిర్ణయం తీసుకోవాలి లేదా పెండింగ్‌లో పెట్టాలి. కానీ, కొర్రీలు వేసి వెనక్కి పంపడం ఏంటి?’ అని సీనియర్ ఐఏఎస్‌లు సీఎంవోలోని అధికారులపై నారాజ్‌గా ఉన్నట్టు సమాచారం. ‘మీరు పంపిన ఫైలులో అసలు సమాచారం లేదు, ఇది ఎందుకు రాశారు, మరిన్ని డిటేయిల్స్ కావాలి’ అని అభ్యంతరాలు పెడుతూ మళ్లీ కిందికు పంపడం బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమని సీనియర్ అధికారులు స్పష్టంచేస్తున్నారు.
ఆ అధికారులపై మంత్రులు గుస్సా..
మంత్రులకు తెలీకుండానే సీఎం ఆఫీసులోని అధికారులు వారి వారి శాఖల రివ్యూలు నిర్వహిస్తుండటం పట్ల మినిస్టర్స్ గుర్రుగా ఉన్నట్లు టాక్. సీఎం నేరుగా రివ్యూ నిర్వహిస్తే పర్లేదు. కానీ, ఆయన సెక్రెటరీలు తమకు తెలియకుండా, తమ పరిధిలోని శాఖల అధికారులను పిలిచి మీటింగ్స్ పెట్టడం ఏంటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. చాలా సార్లు సీఎం సెక్రెటరీలు మంత్రులకు సమచారం ఇవ్వకుండా ఆ శాఖ చూస్తున్న సెక్రెటరీలకు ఫోన్ చేసి ఫైల్స్ గురించి, డిపార్ట్‌మెంట్‌లోని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారని, ఇది మంత్రులకు తీవ్ర ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతున్నది. సీఎం ఆఫీసు నుంచి ఫోన్ చేయగానే కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లోని సెక్రెటరీలు అడిగిన ఇన్పర్మేషన్ ఇస్తున్నారు. ఒకవేళ స్పందించకపోతే తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయనే భయంతో మంత్రులకు కూడా చెప్పకుండానే పని పూర్తి చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీనితో కొందరు మంత్రులు సీఎంఓ సెక్రెటరీల పనితీరుపై రేవంత్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
సీనియర్లు వర్సెస్ జూనియర్లు..
సీఎంఓ ఆఫీసులో మొత్తం ఆరుగురు సెక్రెటరీలు ఉన్నారు. అందులో ముగ్గురు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్, ఒకరు ఐఎఫ్ఎస్, ఒకరు డిఫెన్స్ కేడర్ చెందిన అఫీసర్లు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలో ఇద్దరు, సెక్రెటరీ హోదాలో ఇద్దరు, స్పెషల్ సెక్రటరీ, జాయింట్ సెక్రెటరీ హోదాలో ఒక్కొక్కరు పనిచేస్తున్నారు. మెజార్టీ డిపార్ట్ మెంట్స్ బాధ్యతలు చూస్తున్న సెక్రెటరీలు సర్వీసులో జూనియర్లు. దీనితో శాఖల వారీగా సమాచారం ఇచ్చే విషయంలో.. ఫైల్స్ క్లియరెన్స్ టైంలో డిపార్ట్‌మెంట్ సెక్రెటరీలు, సీఎం సెక్రెటరీల మధ్య జూనియర్, సీనియర్ అనే స్పర్ధలు తలెత్తినట్లు తెలుస్తున్నది. తన కంటే జూనియర్ ఆఫీసర్ అడిగితే ఎందుకు ఆన్సర్ చేయాలనే తీరుతో సీనియర్ ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్నారని టాక్ ఉంది. అలాగే సీఎంఓ సెక్రెటరీలు తాము సీఎం ఆఫీసులో పనిచేస్తున్నామని, అడిగిన ఇన్పర్మేషన్ ఇవ్వాలని ఫోన్ చేసిన టైంలో గర్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
* సీఎం ఆఫీసులో చేస్తున్న ఒక సెక్రెటరీ ఓ శాఖకు చెందిన రివ్యూలు నిర్వహిస్తుండగా, అదే టైంలో ఆ మంత్రికి తన శాఖ అధికారులు ఫోన్ చేసి సీఎం సెక్రెటరీ నిర్వహిస్తోన్న రివ్యూలో ఉన్నామని ఆయనకు చెప్పారు. వెంటనే సదరు మంత్రి ఆ సీఎం సెక్రెటరీకి ఫోన్ చేసి తనకు తెలీకుండా రివ్యూ ఎలా చేస్తావు? అని సీరియస్‌గా క్లాస్ తీసుకోవడంతో పాటు సీఎంకు సైతం జరిగిన విషయాన్ని వివరించినట్టు తెలిసింది.
* సీఎం ఆమోదం కోసం పంపిన ఓ ఫైల్‌పై నిర్ణయం తీసుకోకుండా సీఎంఓ సెక్రెటరీ కొర్రీలు పెట్టి తిరిగి పంపారు. అలా ఎందుకు పంపారని ఓ సీనియర్ ఐఏఎస్.. సీఎంఓలో పనిచేస్తున్న జూనియర్ ఐఏఎస్‌ను ప్రశ్నించారు. ‘నేను అలాగే పంపుతా. నా ఇష్టం’ అని జూనియర్ ఐఏఎస్ జవాబిచ్చారు. దీంతో కోపం తెచ్చుకున్న సీనియర్ అధికారి ఆ జూనియర్ ఐఏఎస్‌ను బూతులు తిట్టినట్టు ప్రచారం.
* ఓ ఫైల్ విషయంలో ఓ సీనియర్ మంత్రి చెప్పేది వినకుండా సీఎంఓ సెక్రెటరీ ఒకరు అదేపనిగా మాట్లాడుతున్నారు. దీంతో చిరాకు పడిన మంత్రి తనదైన స్టైల్లో సదరు అధికారికి క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. అనుభవంలేని వాళ్లను పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని సీరియస్ అయినట్లు టాక్.






