సర్పంచ్ ఎన్నికల ఎఫెక్ట్: TG బీసీ కమిషన్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

సర్పంచ్ ఎన్నికల ఎఫెక్ట్: TG బీసీ కమిషన్ కీలక నిర్ణయం

సర్పంచ్ ఎన్నికల ఎఫెక్ట్: TG బీసీ కమిషన్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నిల్లో ఎన్నికైన గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల కుల వివరాలను పంచాయతీరాజ్ కమిషనర్ నుండి కోరాలని రాష్ట్ర బీసీ కమిషన్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో బీసీ విభాగాలను ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలపై శనివారం హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషన్ విస్తృతంగా చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం 343 ప్రభుత్వ విభాగాలకు గాను 333 ప్రభుత్వ విభాగాల నుండి ఉద్యోగస్తుల కుల వివరాలు కమిషన్‌కి అందినట్లుగా పేర్కొన్నారు. ఇంకా రావలసిన 10 ప్రభుత్వ విభాగాలలో 8 ప్రభుత్వ విభాగాలు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌కి సంబంధించినవి కాగా 2 ప్రభుత్వ విభాగాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినవని కమిషన్ తెలిపింది.

ఈ పది ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వివరాలు రాని కారణంగా బీసీ కమిషన్ తలపెట్టిన ఉద్యోగుల వివరాలు రాష్ట్ర విశ్లేషణ విషయంలో జాప్యం జరుగుతుందని, ఫైనాన్స్ మరియు మున్సిపల్ శాఖ కార్యదర్శులను సత్వరమే ఉద్యోగులకు సంబంధించిన కులాల వివరాలను సమర్పించాలని కమిషన్ కోరింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీడ్ పథకానికి అర్హులకు కావాల్సిన డీఎన్టి సర్టిఫికేట్ జారీ విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. ఈ అంశంపై కమిషన్ తరపున ఢిల్లీలోని డీఎన్టి బోర్డును సందర్శించి, సంప్రదింపులు జరిపిన అధికారితో వివరాలు తెలుసుకున్నారు.

రాష్ట్రంలో సంచార జాతులను రాష్ట్రప్రభుత్వం నోటిఫై చేయాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించనున్నట్లు కమిషన్ తెలిపింది. ప్రస్తుతం జారీ చేస్తున్న కుల ధృవీకరణ పత్రాలలో చేయవలసిన మార్పులను కూడా కమిషన్ సూచించనుంది. దీనిపైన పూర్తి నివేదికను వచ్చే సమావేశంలో చర్చించి, ఆమోదించాలని కమిషన్ నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ బాల మాయ దేవి, డిప్యూటి డైరెక్టర్ యు. శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె. మనోహర్ రావు, ప్రత్యేక అధికారి సునీత, సెక్షన్ ఆఫీసర్ జి. సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story