- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టు నిబంధన.. టీచర్లకు టెట్ బెంగ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) టెన్షన్‌తో సతమతమవుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) టెన్షన్‌తో సతమతమవుతున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పటికీ తాజా నిబంధనల ప్రకారం టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో 45,742 వేల మంది టీచర్లు ఈ పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పరీక్షకు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండటం, సిలబస్‌లో తాము బోధించని ఇతర సబ్జెక్టులు కూడా ఉండటంతో మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలకు కేవలం నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. జనవరి 16 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. పైగా, వీరు విధులు నిర్వహిస్తూనే ఈ పరీక్షకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. విధుల్లో ఆలస్యం, కుటుంబ బాధ్యతల మధ్య ఈ తక్కువ టైంలో క్వాలిఫై అయ్యేంతగా సిద్ధం కావడం కష్టమని పలువురు టీచర్లు వాపోతున్నారు.
ఇతర సబ్జెక్టుల భారం..
ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు ప్రధానంగా ఆందోళన చెందే విషయం ఏంటంటే తాము బోధించే సబ్జెక్టుపై కాకుండా, ఇతర సబ్జెక్టుల సిలబస్‌ను ఎలా చదవడం అనే దానిపైనే ఉంది. ఉదాహరణకు, ఒక సోషల్ స్టడీస్ టీచర్ ఇప్పుడు గణితం, సైన్స్ లేదా భాషలకు సంబంధించిన బోధనా పద్ధతులు, కంటెంట్‌ను కూడా అధ్యయనం చేయాల్సి వస్తోంది. చాలా ఏళ్లుగా కేవలం తమ సబ్జెక్టుకే పరిమితమైన టీచర్లు, అనూహ్యంగా ఈ మొత్తం సిలబస్‌ను కవర్ చేయాల్సి రావడం వారిలో ఒత్తిడిని పెంచుతోంది. ‘మేము ఇన్నేళ్ల నుంచి ఒకే సబ్జెక్టు బోధిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా మొత్తం టెట్ సిలబస్ చదవాలంటే ఎలా? మాకు కనీసం మూడు నెలల సమయమైనా ఇవ్వాలి. పైగా, ప్రస్తుతమున్న పాత సిలబస్ విధానం మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది’ అని ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
45 వేల మందిపై ప్రభావం..
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని సుమారు 45 వేల మంది టీచర్లు ప్రభావితం కానున్నారు. కొత్త నియామకాలకు మాత్రమే కాకుండా, పదోన్నతులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో గతంలో డీఎస్సీ ద్వారా నియమితులై, టెట్ నుంచి మినహాయింపులేని టీచర్లు అంతా దీని పరిధిలోకి వస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 45,742లుగా ఉన్నది. వీరంతా టెట్ క్వాలిఫై కాకపోతే వారి సర్వీస్ విషయం లేదా ప్రమోషన్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో రూపొందించిన టెట్ నిబంధనల్లో.. 2010 నాటికి ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. ఈ కారణంగానే గత 15 ఏండ్లుగా ఉపాధ్యాయులు టెట్ రాసే ఆలోచన చేయలేదని వారు గుర్తు చేస్తున్నారు. 2010 ఆగస్టు 23 తర్వాత నియమితులైన టీచర్లకు మాత్రమే టెట్ తప్పనిసరి చేయాలని, అంతకుముందు నియమితులైన వారికి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.






